ప్రజాశక్తి - పాలకొండ: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు అన్నారు. ఆదివారం ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో పాలకొండ మండలంలో పనిచేస్తున్న వర్కర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలను, కళాశాలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ (ఆయా) వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించలేక చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెలా 5లోపు వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, శానిటేషన్ పరికరాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, సంవత్సరానికి రెండు జతలు యూనిఫాంలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, శానిటేషన్ కార్మికులందర్నీ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ దిగువ తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటేషన్ వర్కర్స్ యూనియన్( సిఐటియు) సభ్యులుగా చేరాలని తీర్మానించారు. అనంతరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బి.చిన్నముడు, ప్రధాన కార్యదర్శిగా పి.జ్యోతి, వైస్ ప్రెసిడెంట్ గా కె.రజిని, కార్యదర్శిగా పి.గౌరి, కోశాధికారిగా బి.గౌరీ, కార్యవర్గ సభ్యులుగా డి.నరసమ్మ, టి.ధనలక్ష్మి, డి.కుమారి తదితరులతో పాటు సిఐటియు మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.










