
ప్రజాశక్తి - గణపవరం
గ్రామాలను ఆరో గ్యవంతమైన వాతావరణంలో ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు శనివారం గణపవరం పంచాయతీ వద్ద కాఫీ విత్ క్లాప్ మిత్రాస్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద ప్రతి ఒక్కరూ జిల్లా వ్యాప్తంగా డస్ట్ బిన్నులు వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మరుగుదొడ్లు, తడి, పొడి చెత్త, మురుగునీటి నిర్వహణపై అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య కార్మికులు మనసుపెట్టి సేవలందించాలని చెప్పారు. అనంతరం గణపవరం రెండో సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులు, రూములు, కంప్యూటర్ డేటా సెంట్రల్‌ను పరిశీలించారు. నవంబరు 15వ తేదీలోపు జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టుల సేవలు గ్రామాలకు తెచ్చినట్లు చెప్పారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎం.అలంకారం, ఉపసర్పంచి దండు రాము, జిల్లా పంచాయతీ అధికారి జివి.మల్లికార్జునరావు, సిపిఒ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.