Aug 12,2023 21:06

ఎం.వెంకటేషన్‌ను సన్మానిస్తున్న కలెక్టర్‌, ఎస్‌పి,

రాయచోటి : సమాజం ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉందంటే సఫాయి కర్మచారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, సఫాయి కర్మ చారీ పారిశుధ్య కార్మికుల కృషే కారణమని సఫాయీ కర్మచారీ జాతీయ కమిషన్‌ చైర్మన్‌ ఎం.వెంకటేషన్‌ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో సఫాయీ కర్మచారీల కోసం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై కలెక్టర్‌ గిరీష, ఎస్‌పి గంగాధర్‌రావు, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జిల్లా అధికారులతో వెంకటేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు సకాలంలో కార్మికులకు అందుతున్నాయా? లేదా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సఫాయి కర్మ చారి వత్తి చేస్తున్న వారి కోసం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అయినప్పుడే వారి అభివద్ధి సాధ్యమన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సఫాయి కార్మికుల చేస్తున్న కషి ఎనలేనిదని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరమైన డ్రైనేజీల్లో దిగి వాటిని శుభ్రపరుస్తూ ఎంతో మంది మ తిచెందారని అన్నారు. అలాంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అందిస్తున్న నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సభకు హాజరైన కర్మచారులను, వివిధ సంఘాల ప్రతినిధులను, వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రం రాయచోటిలో ఒక ఈఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మించాలని కోరగా చైర్మన్‌ సానుకూలంగా స్పందించారు. ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలను ఇవ్వవలసిందిగా కోరగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇళ్ల పట్టా ఇవ్వడమనేది పాలసీ మేటర్‌ అని, సఫారీ కర్మచారుల లో ఇల్లు లేని వారికి కు ఇళ్ల పట్టా ఇవ్వడం గురించి సీఎంవోకి తెలియజేశామని త్వరలోనే దానికి సమాధానం రావచ్చని కలెక్టర్‌ చైర్మన్‌కి తెలిపారు. కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ నెంబరు తదితర వాటిని గుర్తుంచుకోవాలని వారికి సూచించారు. ఐడి కార్డుల మీద ఆ నంబరు తదితర ముఖ్యమైన నెంబర్లను ప్రింట్‌ అయ్యేలా చూడాలని కలెక్టర్‌కి సూచించారు. కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ అధికారులందరూ సఫాయి కర్మచారుల సమస్యలను నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేయాలని, ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇఎస్‌ఐ తదితర వాటి గురించి అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎస్పీ గంగాధర్‌రావు మాట్లాడుతూ సఫాయి కర్మచారి చట్టం 2013 చాలా బలమైనదని, వారి గురించి అన్ని విషయాలు చట్టంలో చేర్చబడ్డాయని వారి పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఫోన్‌ కాల్‌ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. అంతకుముందు డిపిఒ ధనలక్ష్మి సఫాయి కర్మచారులకు జిల్లాలో చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, వారి స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చైర్మన్‌కు వివరించారు. జిల్లాలో 554 గ్రామాలు ఉన్నాయని అన్ని గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా గుర్తించబడ్డాయని, 548 గ్రామాలలో ఘన వ్యర్థాల నిర్వహణ జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 1291 క్లాప్‌ మిత్రాలు ఉన్నారని, పట్టణ ప్రాంతాలలో 163 మంది శాశ్వత సఫాయి కర్మచారులు పనిచేస్తున్నారని తెలిపారు.