ప్రజాశక్తి - తుళ్లూరు: రాజధాని ప్రాంతం,అనంతవరం గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు శేషయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పారిశుధ్య కార్మికులు విజ్ఞప్తి చేశారు.పారిశుధ్య విధులు మానేసి రెండో రోజు బుధవారం కూడా అనంతవరం,నెక్కల్లులో కార్మికులు పనులను నిలిపివేసి నిరసనలు తెలిపారు. కార్మికులపై వేధింపులు ఆపాలని, కార్మికుడు శేషయ్యను వెంటనే పనిలోకి తీసుకోవాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ,కార్మికులకు పెండింగ్ ఉన్న ఏప్రిల్ నెల జీతం చెల్లించాలన్నారు .శేషయ్యను అకారణంగా పనికిరావద్దంటూ కో-ఆర్డినేటర్ నరసింహారావు,సూపర్ వైజర్ మన్మధ రావులు చెప్పి వారం రోజులైనప్పటికీ తిరిగి పనిలోకి తీసుకోకుండా శేషయ్యపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అన్యాయమని రవి అన్నారు. శేషయ్య తనను పనిలోకి తీసుకోమని కో-ఆర్డినేటర్, సూపర్ వైజర్ కాళ్ళపై పడినా పేద కార్మికుడన్న కనికరం చూపించకుండా అతని కడుపు మీద కొట్టడం దుర్మార్గమని అన్నారు. చీటికీమాటికీ రాజధానిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను వారం,పది రోజులు పనికి రావద్దని భయపెట్టి తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకోవటం తగదన్నారు. వేధింపులకు పాల్పడే వారికి తగిన సమయంలో కార్మికులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తక్షణం శేషయ్యను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.










