Apr 17,2023 20:59

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

పారిశుధ్య చర్యలు ముమ్మరం
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     మున్సిపల్‌ పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసి పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వైఎస్సార్‌ సెంటినరీ హాలులో స్పందన కార్యక్రమం నిర్వమించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతి.టి, ఇంచార్జి డిఆర్‌ఓ కామేశ్వరరావు తదితరులు అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తుపై సత్వరమే స్పందించి నాణ్యతతో ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వసతి గృహాల్లో కూడా పారిశుధ్య చర్యలు పాటిస్తూ విద్యార్థుల్లో రక్తహీనత అధిగమించేందుకు మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన ఆహార పదార్థాలను అందజేయాలన్నారు. వసతి గృహాలను హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. వడగాల్పులపై ప్రజల అప్రమత్తమయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు సమకూర్చాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.