Sep 12,2023 23:18

ప్రజాశక్తి - భట్టిప్రోలు
పంచాయతీలో అద్వాన్న పారిశుధ్యం, మురుగునీరు నిల్వతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గత శుక్రవారం బాపట్ల డిపిఒ దాసరి రాంబాబు పరిశీలించారు. మురుగునీటిని తక్షణం బయటకు మళ్ళించాలని స్థానిక అధికారులకు సూచించారు. కానీ పంచాయతీ అధికారులు నేటి వరకు మురుగునీరు మళ్లింపుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మంగళవారం భట్టిప్రోలు వచ్చిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచి తనకు ఏమీ పట్టినట్లుగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రజా ప్రతినిధిగా గ్రామానికి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి చూసుకోవాల్సి ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తక్షణమే పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు సమాచారం అందించాలని కోరారు. ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని చెప్పారు. పంచాయతీలో జరుగుతున్న లావాదేవులకు సంబంధించిన రికార్డులు కూడా పరిశీలన చేస్తామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై తక్షణ చర్యలు చేపట్టకపోతే అందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కార్యదర్శి కోట శ్రీనివాసరావును హెచ్చరించారు. జెసిబిని ఏర్పాటు చేసి డ్రైను తీపించాలని చెప్పారు. గ్రామంలో నిల్వ ఉన్న మురుగునీటిని బయటికి పంపించాలని చెప్పారు. జెసిబి కోసం రెండు గంటల పాటు కార్యాలయంలోని నిరీక్షించారు. ఎంతసేపటికి జెసిబి రాకపోవడంతో అసహనానికి గురై ఆగ్రహంతో వెళ్లిపోయారు. గ్రామంలో నెలకొన్న నిర్లక్ష్య వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులుపై చర్యలు తీసుకుంటానని డిపిఓ తెలిపారు. తగిన నివేదికలు సిద్ధం చేసి పంపించాలని ఎంపీడీవో గుమ్మ చంద్రశేఖర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ రామచంద్రరావు, డ్రైనేజీ ఏఈ సువత్సల, కార్యదర్శి శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు కుక్కల భూషణరావు ఉన్నారు.