ప్రజాశక్తి -మధురవాడ : పారిశ్రామిక వేత్తలు, ముఖ్యంగా దేశ కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యతగా సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయడు పిలుపునిచ్చారు. విశాఖలోని ఐటి హిల్‌పై ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థ ఆవరణలో ఆదివారం జరిగిన కార్పొరేట్ కనెక్షన్స్ బిజినెస్ కాన్‌క్లేవ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తోందన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోనే తృతీయ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగనుందని పేర్కొన్నారు. అమెరికా తరువాత స్టార్టప్‌ల సంఖ్య మన దేశంలోనే అధికంగా ఉందన్నారు. భారతీయ సమాజం మేధోపరంగా ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉందని, నూతన విద్యావిధానం అందుకు ప్రోత్సాహం కలిగించే దిశలో ప్రయాణిస్తోందని చెప్పారు. ఈ ఏడాది దేశంలో జరగనున్న జి20 సమావేశాలలో భారతదేశం పర్యావరణం, ఆర్థిక నేరగాళ్ళ అప్పగింత వంటి అంశాలతో పాటు వసుదైక కుటుంభం నినాదాన్ని ప్రపంచానికి చాటాలన్నారు.
సంపద పెంచకుండా పంచుకుంటూ పోతే అనర్థమే
సంపద పెంచుకోకుండా పంచుకుంటూపోతే అనర్థాలకు దారితీస్తుందన్నారు. అప్పులకు వడ్డీలు కట్టడంతోనే సరిపోతుందన్నారు. అవసరార్ధులకు చేయి అందించాలి తప్ప భుజం ఎక్కించి మోయకూడదని పేర్కొన్నారు. సమాజంలో శాంతిని పెంపొందించాలని, వ్యాపారంలో సహితం నైతిక విలువలు పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివి.సోమయాజులు మాట్లాడుతూ, ఆర్థిక ప్రగతితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో పారిశ్రామికవేత్తలు వ్యవహరించాలన్నారు.