ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి
పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రానికి రాని అదానీ, తన పాలనలో నేడు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని అన్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ఎటిసి టైర్ల పరిశ్రమ తొలి యూనిట్‌ను మంగళవారం ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సిఎం మాట్లాడారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ శంకుస్థాపనకు శ్రీకారం చుడతామన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారంతో పూర్తి సంతృప్తి చెంది ఎటిసి టైర్ల పరిశ్రమ రెండో దశ యూనిట్ ఏర్పాటుకు యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. మొదటి దశలో రూ.1250 కోట్లతో ప్రారంభించిన తొలి యూనిట్‌లో 1200 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రూ.850 కోట్లతో రెండో దశ యూనిట్ పూర్తయితే 800 మందికి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రెండో దశ పనులు 12 నెలల వ్యవధిలో 2023 ఆగస్టులోగా పూర్తి చేస్తామని యాజమాన్యం చెబుతుందన్నారు. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన ప్రోత్సాహక బకాయిలను ఎంఎస్‌ఎంఇలకు చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ పారిశ్రామికంగా దేశంలో నెంబర్ వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎటిసి టైర్ల పరిశ్రమ సిఇఒలు నితిన్ మంత్రి, అనిల్ గుప్తా మాట్లాడుతూ తొలి యూనిట్ ఉత్పత్తిలో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించామన్నారు. వీరిలో మహిళలు 30 శాతమున్నారని తెలిపారు. 15 నెలల్లో యూనిట్ ఉత్పత్తిలోకి రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తొలుత సిఎం టైర్ల పరిశ్రమ లోపల ఉత్పత్తి యూనిట్‌ను సందర్శించారు. నూతనంగా ఉత్పత్తి చేసిన టైర్‌పై ప్రారంభోత్సవానికి సూచికగా సంతకం చేశారు.
ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన
రూ.3202 కోట్లతో ఏర్పాటుకానున్న ఎనిమిది పరిశ్రమలకు ఎటిసి టైర్ల పరిశ్రమ సభ ప్రాంగణం నుంచి సిఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎటిసి టైర్ల పరిశ్రమ రెండో యూనిట్, మెస్సర్స్ పిడిలైట్ ఇండిస్టీ, మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్, ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్, ఆప్టిమస్ డ్రగ్స్, విన్‌విన్ స్పెషాల్టీ ఇన్సులేటర్స్, సైనాప్టిక్స్ ల్యాబ్, స్టైరాక్స్ లైఫ్ సైన్సెస్, ఇషా రిసోర్సెస్ పరిశ్రమల పనులకు సిఎం శ్రీకారం చుట్టారు.
సిఎంకు ఘన స్వాగతం
విశాఖ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎటిసి టైర్ల కంపెనీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యేలు యువి.రమణమూర్తిరాజు, అదీప్‌రాజు, గొల్ల బాబూరావు, పి.ఉమాశంకర్ గణేష్, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎస్‌పి గౌతమి శాలి, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, ఎస్‌పి గౌతమిశాలి, యోకహోమా కంపెనీ కౌన్సిల్ జనరల్ తాజా మాసా యుకిసిన్, ఎటిసి సిఇఒలు నితిన్ మంత్రి, అనిల్ గుప్తా, కంపెనీ రాష్ట్ర ప్రతినిధి ప్రహ్లాద్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.










