ప్రజాశక్తి -మధురవాడ : పారిశ్రామిక, రక్షణ రంగాలలో ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సంవృద్ధి దిశగా భారతదేశం ఎదుగుతుందని ఎన్‌ఎస్‌టిఎల్ అసోసియేట్ డైరెక్టర్ టివిఎస్.గణేష్‌కుమార్ పేర్కొన్నారు. దీనికి పరిశ్రమలు, విద్యాలయాలు, రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా పనిచేయడం ఉత్తమ ఫలితాలు ఇస్తుందని తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ''ఫాల్ట్ డయాగసిస్ ఆఫ్ రొటేటింగ్ మెషినరీ'' అంశంపై వర్క్‌షాపును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే శాస్త్రవేత్తలు, విద్యారంగ నిపుణులు, పరిశ్రమల నిపుణులు పరస్పరం కలిసి చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) పరిజ్ఞానంతో పరిశ్రమల నిర్వహణ రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. ఇండిస్టీ 4.0 లో కండిషన్ మానిటిరింగ్ మూల స్తంభంగా మారిందన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కండిషన్ మానిటరింగ్ సొసైటీ వంటి నిపుణుల విభాగాలలో సభ్యులుగా చేరడం ద్వారా భవిష్యత్తులో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. గీతం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఐటి జబల్పూర్ నిపుణులు డాక్టర్ ఎమ్.అమర్‌నాధ్, ఎన్‌ఎస్‌టిఎల్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ టి.వెంకటరత్నం, ఎస్‌విడి మెషినరీ వైబ్రేషన్ సొల్యూషన్స్ సంస్థ శిక్షణాధికారి జి.సుబ్బారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌ఆర్‌ఎస్. సత్యనారాయణ, వర్క్‌షాపు కో-ఆర్డినేటర్లు డాక్టర్ ఎమ్.రామ్మోహనరావు, డాక్టర్ ఆర్.భానుపవన్ తదితరులు పాల్గొన్నారు.










