జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విచారకరం. ఇది పారదర్శకతకు పాతర వేయడమే! ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రజల నుండి ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు బలపడతాయి. సమాచార సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో సాధికారిక సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడమే అన్ని విధాల శ్రేయస్కరం. జీవో లను ఆన్‌లైన్‌లో ఉంచడమన్నది గత పుష్కరకాలం పైగా వ్యవస్థీకృతమైన ప్రక్రియ! దీనివల్ల ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ప్రజలకు లభించింది. సెల్‌ఫోన్ల వాడకం పెరిగిన తరువాత అరచేతిలోనే జీవోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి ఏవైనా సమస్యలు ఉంటే అధికార యంత్రాంగంతో చర్చించి, వాటిని పరిష్కరించుకుని ఉండాల్సింది. దానికి భిన్నంగా కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయనో, మీడియాలో వార్తలు వస్తున్నాయనో ఆ వ్యవస్థను రద్దు చేయడం దారుణం. ఆన్‌లైన్ ప్రక్రియను రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్‌లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వం పేర్కొనలేదు. కారణం ఏమైనప్పటికీ ఈ నిర్ణయం సామాన్య ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరగడానికి కారణమౌతుంది. గతంలో ఇటువంటి అనుభవాలు రాష్ట్ర ప్రజానీకానికి చాలానే ఉన్నాయి.
సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చింది. ఆ చట్టాన్ని ఉన్నతాధికార యంత్రాంగం పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దాని స్ఫూర్తితో 2008లో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవో లను పూర్తిస్థాయిలో అన్‌లైన్‌లో ఉంచడం ప్రారంభించారు. దీనికోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దానిని కొనసాగించడంతో పాటు, సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ ఆ విధానం కొనసాగింది. రాజన్న రాజ్యం తెస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ వ్యవస్థకు చెల్లు చీటీ ఇవ్వడం స్వవచన వ్యాఘాతమే అవుతుంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు సులభంగా లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉంచి తీరాలి. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్ ఫార్మట్‌లో స్థానిక భాషల్లో సమాచారాన్ని ఉంచాలని చట్టం నిర్దేశించింది. జీవోలన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లేనన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమాచార హక్కు చట్టం ఈ తరహా డాక్యుమెంట్లన్నింటిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచి తీరాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ దాచి పెట్టకూడదని స్పష్టంగా పేర్కొంది. జీవో లను ఆన్‌లైన్‌లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని బాహాటంగా ధిక్కరించినట్టైంది. తెలంగాణ ప్రభుత్వం జీవో లను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నప్పటికీ దళిత బంధు పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంచకపోవడంతో, ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచడానికున్న ఇబ్బంది ఏమిటని అక్కడి హైకోర్టు బుధవారం నాడు ప్రశ్నించింది. 24 గంటల్లో వెబ్‌సైట్‌లో జీవో పూర్తి వివరాలు ఉంచాలని ఆదేశించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.
ప్రభుత్వాలే కాదు, కోర్టులు కూడా తమ తీర్పులను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఉంచుతున్నాయి. బెయిల్ మంజూరైన తరువాత ఆ ఉత్తర్వులు అందడంలో జాప్యం అవుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే ఇస్తామని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లు, ఇతర నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటిని పరిగణ లోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత అప్రజాస్వామికమో, ప్రజల హక్కులపై ఎంత పెద్ద దాడో ఇట్టే అర్ధమవుతుంది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం జీవో లను ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి పట్టం కట్టాలి.










