ప్రజాశక్తి-యంత్రాంగం కాజులూరు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కుయ్యేరు గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి వేణు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూర్చుతుందో వివరించారు. వైఎస్‌ఆర్ కాపు నేస్తం, రైతు భరోసా వంటి పథకాల ద్వారా జరిగిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి ఆ రంగం అభివద్ధికి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తున్నట్టు వివరించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా మన బడి నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అభివద్ధి చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎవరూ ఎక్కడకూ వెళ్లాల్సిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. అవినీతికి తావులేకుండా దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ సేవలు అందుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా వివిధ పథకాల లబ్ధి మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థల ద్వారా అందుతున్న సేవల్లో సంతప్తి స్థాయిని స్వయంగా తెలుసుకునేందుకు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి వేణుగోపాలకష్ణ వివరించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ తదితరాలకు సంబంధించి ప్రజలు తమ దష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించనున్నట్లు తెలిపారు. జులై 1వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సంక్షేమ పథకాలు ఇంకా అందకుండా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా అక్కడికక్కడే సమస్యను పరిష్క రించనున్నట్లు వివరించారు. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. యువనేత చెల్లిబోయిన నరేన్, గ్రామ సర్పంచ్ పిల్లి కృష్ణమూర్తి, జెడ్‌పిటిసి వనుం వెంకట సుబ్బారావు, ఎంపిపి ఎం.భారతి, ఎంపిటిసి సత్యనారాయణ, తహసీల్దార్ సాయి సత్యనారాయణ, ఎంపిడిఒ రతన్‌రాజు, మండల బిసి సెల్ కన్వీనర్ గుబ్బల యేసు రాజు స్థానిక నాయకులు యాళ్ల సత్తిబాబు నందికొళ్ళ రమేష్ పాల్గొన్నారు. ఏలేశ్వరం అవినీతిరహిత పారదర్శక పాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. గురువారం ఏలేశ్వరంలో గడపగడపకు కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకే ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల్లో ఏ పనున్నా కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసిపి నాయకులు అలమండ చలమయ్య, శిడగం త్రివేణి, సుంకర రాంబాబు, వాగు బలరాం, తొండారపు రాంబాబు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు ఉన్నారు. పెదపూడి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను రెండోసారి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని రామేశ్వరంలో సర్పంచ్ కోటికలపూడి చినబాబు ఆధ్వర్యంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా 48 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలో ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో ఎంఎల్‌ఎ వివరించారు. ఈ కార్యక్రమంలో కొటికలపూడి చినబాబు, ఎంపిపి కేతా తులసి, జెడ్‌పిటిసి సభ్యురాలు పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, గాజుల మణికంఠ, గంగుమళ్ల సుబ్రహ్మణ్యం, కోసూరి వాసు, వైస్ ఎంపిపి కరెడ్ల వెంకన్నబాబు, తోటకూర వెంకన్న, పప్పు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.










