May 27,2023 22:34

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

ప్రజాశక్తి - కాకినాడ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రణాళికాయుతంగా కృషిచేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై కలెక్టర్‌ కతికా శుక్లా ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌తో కలిసి రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌, సర్వే, సాంఘిక సంక్షేమం, వ్యవసాయ, మత్స్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఖాళీల వివరాలను వెంటనే ప్రత్యేక పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. రిక్వెస్ట్‌ ప్రాతిపదికన ప్రొబేషన్‌ పూర్తయిన వారికి సీనియారిటీ ఆధారంగా ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు చేపట్టనున్నట్లు వివరించారు. అంతర జిల్లాల బదిలీలకు స్పౌజ్‌, పరస్పర అంగీకారం అంశాలను పరిగణన లోకి తీసుకోనున్నట్లు తెలిపారు. జూన్‌ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. బదిలీకి అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అప్‌ లోడ్‌ చేసేలా అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేయాలన్నారు. బదిలీల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కతికా శుక్లా అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్‌పి సిఇఒ ఎన్‌వివి సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్‌పి పి.శ్రీనివాస్‌, డిపిఒ ఆర్‌.విక్టర్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, పశు సంవర్ధక అధికారి డాక్టర్‌ సూర్యప్రకాష్‌రావు, కార్పొరేషన్‌ ఎడిసి కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.