* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - బూర్జ: ఓటర్ల నమోదును పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని కొల్లివలస పోలింగ్ కేంద్రం పరిధిలో చేపడుతున్న ఓటర్ల సర్వేను ఆదివారం పరిశీలించారు. ఓటర్ల సర్వేలో ఏమాత్రం అవకతవకలున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంటింటి సర్వుే ఈనెల 18వ తేదీ నాటికి శత శాతం పూర్తి కావాలని ఆదేశించారు. లక్ష్యాలను పూర్తి చేయడానికి గడువు తక్కువ ఉండడంతో పనిలో వేగం పెంచాలన్నారు. తొలగింపు ఓటర్లను మరోమారు పరిశీలించాలన్నారు. తొలగింపునకు తగిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డాక్యుమెంటేషన్ సరిగా లేని బిఎల్‌ఒలపై చర్యలు తప్పవన్నారు. శతశాతం పరిశీలన అనంతరం ఈనెల 28న బిఎల్‌ఒలు రిపోర్టులు సమర్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని, జాబితాలు రూపొందించడంలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. వాలంటీర్ల పాత్ర ఎక్కడా కనిపించకూడదని, వారి సహకారం తీసుకున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ బి.శాంతి, తహశీల్దార్ ఎస్.రమణారావు, విఆర్‌ఒ రాజారావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్, విఆర్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.










