Aug 30,2023 23:00

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌ ఇంటింటికి ఓటర్ల సర్వేలో భాగంగా ఫారం -7 ద్వారా వచ్చిన ఓట్ల తొలగింపు క్లెయిమ్‌ల వాస్తవికతను నిర్ధారించడంలో బిఎల్‌ఒలు మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్‌, సిటీ నియోజకవర్గ ఇఆర్‌ఒ సిహెచ్‌.నాగ నరసింహారావు సూచించారు. బుధవారం ఆయన 11, 21, 23, 29, 55, 71, 74, 116, 119, 123 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐదు కన్నా ఎక్కువ ఓట్ల తొలగింపునకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై విచారించారు. వచ్చిన క్లెయిమ్‌ము వాస్తవికతను నిర్ధారించుకున్నారు. ఫారం-7 ద్వారా వచ్చిన దరఖాస్తులపై కూడా ఆయన ఆరా తీశారు. ఎటువంటి ఫిర్యాదులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్లెయిమ్ల విచారణను మరింత పారదర్శకంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అక్టోబర్‌లో విడుదలయ్యే మొదటి ముసాయిదా లోపుగా ఈ మొత్తం ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆయా పోలింగ్‌ స్టేషన్ల పరిధిలోని బిఎల్వోలు, సూపర్వైజరి అధికారులు ఉన్నారు.