Aug 03,2021 18:35

ముంబయి : అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్‌ ఇచ్చినా.. రెండు నెలల తర్వాత తుదిశ్వాస విడిచింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. పూణెకు చెందిన వేదిక అనే చిన్నారికి ఎస్‌ఎమ్‌ఏ (స్పైనల్‌ మస్కులర్‌ ఎంట్రాఫీ) అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధిబారినపడిన చిన్నారులు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడమే కాదు.. నెమ్మదిగా వారి కదలికలు సన్నగిల్లుతాయి. చివరకు చిన్నారులు మరణించడమూ జరుగుతుంది. ఈ వ్యాధికి జోల్‌గెన్స్‌మా అనే ఇంజెక్షన్‌ ఒక్కటే ఔషధమని వైద్యులు చెప్పారు. ఆ ఇంజెక్షన్‌ విలువ వేలల్లోనో.. లక్షల్లోనో కాదు ఏకంగా 16 కోట్ల రూపాయలు. తల్లిదండ్రులు ఊహించని ఈ పరిణామంతో.. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో.. 16 కోట్లను క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరించారు. అలా సేకరించిన డబ్బుతో ఇంజెక్షన్‌ కొని వేదికకు అందించారు. దీంతో తల్లిదండ్రులతోపాటు.. విరాళాలు ఇచ్చిన దాతలు ఎంతో సంతోషించారు. ఇంజెక్షన్‌ ఇచ్చిన నెల రోజుల వరకూ వేదిక ఆరోగ్యంగానే కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు అసలు ఊపిరి తీసుకోవడానికే వేదిక ఇబ్బందిపడుతుంటే.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స తీసుకుంటూనే కన్నుమూసింది.