
పాణ్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చూడండి
- రైల్వే డిఆర్‌ఎంకు ఎమ్మెల్యే కాటసాని విన్నపం
ప్రజాశక్తి - పాణ్యం
పాణ్యం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే డిఆర్‌ఎం మనీష్ అగర్వాల్‌ను కోరారు. బుధవారం పాణ్యం రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే డిఆర్‌ఎం మనీష్ అగర్వాల్ తనిఖీ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని పాణ్యం, నెరవాడ, కౌలుర్ గ్రామాల్లో నెలకొన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాణ్యం రైల్వే స్టేషన్ మీదుగా 8:30కి వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్ ఆగేలా చూడాలన్నారు. అలాగే హుబ్లీ -విజయవాడ, గుంటూరు -కాచిగూడ, కాచిగూడ-గుంటూరు తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఆపాలని కోరారు. నెరవాడ రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. పాణ్యం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, సోలార్ పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ప్రజల రాకపోకలకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పాణ్యం రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాణ్యం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే విన్నపానికి సానుకూలంగా స్పందించిన డిఆర్‌ఎం త్వరలోనే నిర్ణయం తీసుకొని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలబడేలా చూస్తామన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.