Jul 11,2023 00:12

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : పాము కాటుతో చిన్నారి మృత్యువాత పడిన ఘటన గుంటూరు నగరం వేళంగిణి నగర్‌ 5వ లైను, 3వ అడ్డరోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న నిరీక్షణ (13)ను పాము కాటువేసింది. చుట్టుపక్కల వారు గుర్తించి బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స చేసే క్రమంలో మృతి చెందింది. బాలిక నివశిస్తున్న పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండటం, పిచ్చిమొక్కలతో ఈ ప్రాంతం అంతా నిండి ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పిచ్చిమొక్కలను తొలగించాలని కార్పొరేషన్‌ అధికారులను కోరినా పట్టించుకోలేదని అంటున్నారు. అయితే ఇటీవల పిచ్చిమొక్కలను తొలగించామని, బాలిక ఇంటికి సమీపంలో పాడుబడిన ఇల్లు ఉండటం వల్ల అందులో పాములు ఉండి ఉండవచ్చునని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి నల్లపు చంద్రశేఖర్‌ ఫిర్యాదుపై కార్పొరేషన్‌ అధికారులు విచారణ ప్రారంభించారు.