Aug 05,2023 21:38

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధు

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని టిక్కబాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి చదువుతున్న ఆరిక సిద్దు అనే గిరిజన విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. రాత్రి నిద్రపోతున్న సమయంలో పాము వచ్చి కాటు వేసిందని, ఈ సంఘటన వేకువ జామున మూడున్నర సమయంలో జరిగిందని తోటి విద్యార్థులు తెలిపారు. అయితే సిద్దు కడుపు నొప్పితో మాత్రమే బాధపడుతున్నాడని ఉపాధ్యాయులు అనుకున్నారు. ఆ తర్వాత పాము కనిపించడంతో పాము కాటుకు గురైనట్లు ఆలస్యంగా గుర్తించారు. అయితే స్థానికంగా వైద్య సేవలు లేకపోవడంతో వార్డెన్‌ పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్న సిద్దును మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌ తరలించాలని వైద్యులు సూచించారు.
విద్యార్థులకు రక్షణ కరువు
వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలల్లో రక్షణ కరువవుతుంది. ఒకవైపు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుంటే మరోవైపు పాము కాటుకు గురవుతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎఎన్‌ఎంలు లేకపోవడంతో విద్యార్థులకు సకాలం వైద్యం అందడం లేదు. విద్యార్థులకు రక్షణ చర్యలు కూడా లేకపోవడంతోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్య భద్రత దేవుడి మీదే భారం వేయాల్సి వస్తోంది.
గతంలోనూ పాము కాటుకు గురైన విద్యార్థులు....
గతంలో కూడా విద్యార్థులు పాము కాటుకు గురైన సందర్భాల్లో ఉన్నాయి. కురుపాం లోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మంతిని రంజిత్‌ కుమార్‌, ఈదుబిల్లి వంశీ, వంగపండు నవీన్‌ పాము కాటుకు గురయ్యారు. వీరిలో మంతిని రంజిత్‌కుమార్‌ మృతి చెందాడు. మిగతా ఇద్దరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటికైనా ఐటిడిఎ అధికారులు స్పందించి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ చర్యలు చేపట్టాలని, ఆరోగ్య కార్యకర్తలను నియమించి స్థానికంగా వైద్యం అందించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల మరణాలు
పాలకుల నిర్లక్ష్యం వలనే విద్యార్థులు పాము కాటుక గురికావడం, వ్యాధుల బారిన పడి మృతి చెందడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పల్లా సురేష్‌ అన్నారు. పాముకాటుకు గురైన విద్యార్థి సిద్ధూకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ సంఘటనపై ఉన్నత అధికారులు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా విద్యార్థులకు స్థానికంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం నియమించకపోవడం విచారకరమన్నారు. గిరిజన విద్య, విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి, ఐటిడిఎ అధికారులకు చిన్న చూపు తగదన్నారు.