Aug 28,2023 22:01

సబ్సిడీ యంత్రాలు, ఉచితంగా మొక్కలు అందిస్తాం
ఆయిల్‌పామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బలోపేతానికి కృషి
చింతలపూడి రైతులకు పరిహారం అందించి, ప్రాజెక్టు పూర్తి చేస్తాం
రైతుల బాధలు పట్టని ఎంపీ, ఎంఎల్‌ఎ
యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌
చింతలపూడిలో మరోసారి ఉద్రిక్తత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, చింతలపూడి

టిడిపి అధికారంలొకొచ్చాక పామాయిల్‌ రైతులకు అండగా ఉంటామని, సబ్సిడీపై యంత్రాలు, ఉచితంగా మొక్కలు అందించడంతోపాటు, పామాయిల్‌ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తెలిపారు. సోమవారం 197వ రోజు యువగళం పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో సాగింది. సుందరరావు పేటలో ప్రారంభమై లింగపాలెం, జూబ్లీనగర్‌, వెలగపల్లి, ఫాతిమాపురం, చింతలపూడి మీదుగా తీగలవంచ గ్రామం వరకూ సాగింది. రాత్రికి అక్కడ బస చేశారు. జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో లోకేష్‌ను కలిసిన లింగపాలెం గ్రామస్తులు, చింతలపూడి లిప్ట్‌ ఇరిగేషన్‌ బాధిత రైతులు, చింతలపూడి నగర పంచాయతీ ప్రజల సమస్యలపై వినితిపత్రాలు అందించారు. చింతలపూడిలో పామాయిల్‌ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ లోకేష్‌ మాట్లాడారు. పామాయిల్‌ రైతులకు జగన్‌ చేసింది సున్నా అన్నారు. పామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, వైసిపి ప్రభుత్వం, ఎంపీలు, ఎంఎల్‌ఎలు పట్టించుకోవడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పామాయిల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను బలోపేతం చేస్తామన్నారు. ఇతర దేశాల్లో మాదిరిగా రికవరీ శాతం వచ్చేలా అన్ని చర్యలూ చేపడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పామాయిల్‌ ఫ్యాక్టరీ పెట్టి రికవరీ రేటును పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చేది టిడిపి అని, కేంద్రంలో కూడా టిడిపి మద్దతిచ్చే పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. సబ్సిడీపై డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలు, యంత్రాలు అందిస్తామన్నారు. మిషన్‌ మోడల్‌ ఆయిల్‌పామ్‌ పంటను ప్రోత్సహిస్తామన్నారు. రైతు కళ్లలో ఆనందమే టిడిపి లక్ష్యమన్నారు. పామాయిల్‌ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర వచ్చేలా టిడిపి బాధ్యత తీసుకుంటుందన్నారు. పామాయిల్‌ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు.
సమస్యలపై జనం వినతులు
చింతలపూడి నగర పంచాయతీలో రోడ్లు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, సీసీ రోడ్లు ఆగిపోయాయని, యువతకు పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించాలని, తాగునీటి పైప్‌లైన్‌ కలుషితమవుతుందని, కొత్త పైప్‌లైన్‌ వేయాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని, శ్మశాన వాటికలకు రక్షణ గోడ నిర్మించాలని, చింతలపూడి బస్సు డిపో ఏర్పాటు చేయాలని పలు సమస్యలను వినతిపత్రంలో ప్రస్తావించారు. చింతలపూడి ప్రాజెక్టు బాధిత రైతులు కలిసి ఎకరానికి రూ.30 లక్షలు ఇస్తామని ప్రస్తుత ఎంఎల్‌ఎ, ఎంపీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటం చేసి పట్టించుకోవడం లేదన్నారు. మా భూములను 22ఎ పరిధిలో పెట్టడంతో భూములు అమ్ముకోవడంగాని, తాకట్టు పెట్టుకోవడం కూడా చేయలేకపోతున్నామని చెప్పారు. టిడిపి అధికారంలోకొచ్చాక న్యాయం చేయాలన్నారు. లింగపాలెం గ్రామస్తులు వినతిపత్రంలో పలు సమస్యలను ప్రస్తావించారు. గ్రామంలో రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీ పథకాలు పునరుద్దరించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలపై లోకేష్‌ మాట్లాడారు.
ఎంపీ పట్టించుకోరు.. ఎంఎల్‌ఎ గురించి మాటలు అనవసరం
పామాయిల్‌ రైతులు సమస్యలతో సతమతమవుతున్నా స్థానిక ఎంపీ పట్టించుకోవడం లేదని, వస్తున్నాం, వెళ్తున్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారని లోకేష్‌ విమర్శలు గుప్పించారు. ఎంఎల్‌ఎ గురించి మాట్లాడటం అనవసరం అని వ్యాఖ్యానించారు.
చింతలపూడిలో మరోసారి ఉద్రిక్తత
లోకేష్‌ యువగళం పాదయాత్రలో వైసిపి కవ్వింపు చర్యలు కొనసాగాయి. నూజివీడు మండలంలో కవ్వింపు చర్యలతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోగా చింతలపూడిలో మరోసారి అదే పరిస్థితి నెలకొంది. జగనన్న నువ్వేకావాలి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తోపాటు చింతలపూడి వైసిపి కార్యాలయం వద్దకు యాత్ర చేరుకోగానే జై జగన్‌ అంటూ వైసిపి కార్యకర్త ఒకరు నినాదాలు చేయడంతో టిడిపి కార్యకర్తలు డ్యాన్స్‌లు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
నేడు పాదయాత్ర ఇలా
మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు తీగలవంచ నుంచి పాదయాత్ర ప్రారంభమై పోలవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తోంది. టి.నరసాపురం, గురవాయిగూడెం, వేపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, వెంకటాపురం, బొర్రంపాలెం శివారు వరకూ కొనసాగనుంది. పలుచోట్ల రైతులు, దళితులు, పోలవరం నిర్వాసితులతో లోకేష్‌ సమావేశం కానున్నారు.