Oct 31,2023 22:10

  జంగారెడ్డిగూడెం : పట్టణంలోని ఉప్పల మెట్ట సమీపంలో ఉన్న పామాయిల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని వార్డు కౌన్సెలర్‌ ఇందిరా ప్రియదర్శిని కోరారు. మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ పామాయిల్‌ ఫ్యాక్టరీ విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల ఉప్పల మెట్ట పరిసర ప్రాంతాలలో తాగునీరు కలుషితం అవుతుందని తెలిపారు. వాయు కాలుష్యంతో పాటు తాగునీటి కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మున్సిపాలిటీ నుంచి పామాయిల్‌ ఫ్యాక్టరీకి ఇచ్చే అనుమతులను నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.భవానీ ప్రసాద్‌ పాల్గొన్నారు.