Nov 11,2023 23:27

శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న సంఘ ప్రతినిధులు

* అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ డిమాండ్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ దురాక్రమణ, యుద్ధం ఆపాలని, 1967కు ముందరి భూభాగంతో స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పరచాలని విశాఖ పోర్టు ట్రస్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. నగరంలోని క్రాంతి భవనంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యాన కన్వీనర్‌ బి.కృష్ణమూర్తి అద్యక్షత శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్థిక భవితవ్యం అంతా యూదుల చేతుల్లోనే ఉందన్నారు. ఆ కారణంగా వారికి అమెరికా అండదండలందిస్తోందని తెలిపారు. ఇజ్రాయెల్‌ చేస్తున్న దురాగతాలను బయటకురానికుండా మీడియాను నియంత్రిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నెతన్యాహు ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ఇటువంటి చర్యలు చేశట్టిందని విమర్శించారు. ఇజ్రాయెల్‌ ప్రయివేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాడులకు తెగబడుతోందని దుయ్యబట్టారు. 40 రోజులుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండ వల్ల పది వేలు మందికి పైగా పాలస్తీనా పిల్లలు, మహిళలు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా బాటలోనే మన దేశం కూడా ఇజ్రాయిల్‌ దురాగతాలకు వత్తాసు పలకడం శోచనీయమ న్నారు. ఈ సదస్సులో సాహితీ స్రవంతి కన్వీనర్‌ కె.శ్రీనివాసు మాటాడుతూ ఇజ్రాయెల్‌కి అమెరికా ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధానికి ప్రత్యక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ఇజ్రాయెల్‌ యూదు దురంహంకారాన్ని పెంచిపోషిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అరబ్‌ దేశాల్లో అమెరికా ఆదిపత్యం కోసం ఇజ్రాయెల్‌ పాటుపడుతోందని దుయ్యబట్టారు. అమెరికా ఆయుధాలు అమ్ముకో వడం కోసం కృత్రిమ యుద్ధాలను సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనీయులకు ఆహారం, తాగునీరు మందుల సరఫరాకు ఇజ్రాయిల్‌ అడ్డుకోరాదని కోరారు. 75 ఏళ్లుగా పాలస్తీనా భూభాగాన్ని 75 శాతం ఇజ్రాయెల్‌ ఆక్రమించి వారికి నిలువ నీడలేకుండా చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి చేసిన 800 తీర్మానాలనూ ఇజ్రాయెల్‌ తుంగలో తొక్కిందన్నారు. పాలస్తీనాకు సంఘీభావంగా నిలిచే భారత దేశ విధానాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా తిరగదోడిందని విమర్శించారు. పాలస్తీనా ప్రజలకు భారత ప్రభుత్వం ప్రజలు ఈ ఆపత్కాలంలో అండగా నిలవాలన్నారు. పాలస్తీనా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా వారిపై దాడులు ఆపడంలేదని దుయ్యబట్టారు. ఆస్పత్రులపై దాడులు చేస్తూ అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం క్రాంతి భవన్‌ నుంచి సూర్యమహాల్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పి.తేజేశ్వరరావు, సానూ, షేక్‌ జిలానీ, అనపాన. షణ్ముఖరావు, డి.పార్వతీశం, సిహెచ్‌.వెంకటరమణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.గోపి, పి.సుధాకరరావు, కృష్ణ, చిన్నమ్మడు పాల్గొన్నారు.