Oct 30,2023 23:14

నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-టంగుటూరు : అమెరికా అండదండలతో పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం అమానుషమని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. ఇజ్రాయిల్‌ తీరును వ్యతిరేకిస్తూ స్థానిక బొమ్మల సెంటర్‌లో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ అమెరికా అండతో సాగిస్తున్న ఈ యుద్ధంలో ఇప్పటికే 8000 మందికి పైగా మరణించినట్లు తెలిపారు. అందులో 3500 మంది చిన్నారులు ఉన్నారన్నారు. 4 రోజుల క్రితం ఆసుపత్రిపై ఇజ్రాయిల్‌ బాంబు దాడి చేయగా 116 మంది వైద్యులు, 200 మంది వైద్య సిబ్బంది మతి మృతిచెందినట్లు తెలిపారు. 500 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. హమాస్‌ ంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న ఈ యుద్ధంతో పాలస్తీనాను తునాతునకలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిత్యం మారణకాండ సష్టిస్తుందని ఆయన ఆరోపించారు. యుద్ధ సామగ్రి, ఆయుధాల అమ్మకాల కోసం అమెరికా ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతూ రాక్షసానందం పొందుతుందని విమర్శించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కెజి. మస్తాన్‌ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధాన్ని సాకుగా చూపి మోడీ ప్రభుత్వం మనదేశంలో కూడా మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మతోన్మాద చర్యలతో బిజెపి ఎప్పటికీ రాజ్యాధికారం సాధించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేశపోగు మోజెస్‌, నాయకులు అంగలకుర్తి బ్రహ్మయ్య, వేజెండ్ల సింగయ్య, గడ్డం వందనం, మల్లెల కొండయ్య, తన్నీరు సుబ్బారావు, బెజవాడ శివయ్య, ఎం.పెద్ద పేతురు, ముప్పరాజు బ్రహ్మయ్య, ఎస్‌కె.మీరాస్‌, ఎ.సూరిబాబు, కొల్లాబత్తిన శ్రీను, టి.పాపారావు, షేక్‌ శ్రీను, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.