Nov 10,2023 00:15

విలేకర్లతో మాట్లాడుతున్న వామపక్ష పార్టీల నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ నిర్వహిస్తున్న యుద్ధోన్మాద వైఖరిని విడనాడలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో గురువారం వామపక్ష పార్టీల జిల్లా నాయకుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్‌, సిపిఎం జిల్లా నాయకులు కంచుమాటి అజరు కుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ జిల్లా కార్యదర్శి మన్నవ హరిప్రసాద్‌, సిపిఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి ఉల్లిగడ్డల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఇజ్రాయెల్‌ సేనలు పాలస్తీనా ప్రజలపై దారుణ హత్యాకాండను కొనసాగిస్తుందన్నారు. పాలస్తీనాలోని గాజా ప్రాంతం మొత్తాన్ని 'ఓపెన్‌ జైలు'గా చేసి తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్‌ బంద్‌ చేసి ప్రజలు ఆకలితో బలయ్యేటట్లు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన జిల్లావ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేధావులు, ప్రజాసంఘాలు, ప్రజలు అందరూ పాల్గొని ఖండించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు అరుణ్‌ కుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) లిమిరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎంపి.రాందేవ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు లోకం భాస్కరరావు పాల్గొన్నారు.