
ప్రజాశక్తి-చిలకలూరిపేట : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. పాలస్తీనా ప్రజల సంఘీభావ మిత్రుల ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సభకు ప్రముఖ న్యాయవాది, సిపిఐ సీనియర్ నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు (ఆర్‌వి) అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ బుడ్డిగ జమిందార్ మాట్లాడుతూ పాలస్తీనా ప్రాంతంలోని ఆపారమైన చమరు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం ఇజ్రాయిల్‌కు అమెరికా మద్దతిస్తోందన్నారు. గాజా ప్రాంతానికి ఏమీ సరఫరా కాకుండా ఓపెన్ జైల్‌గా మార్చారని, అంతర్జాతీయ చట్టాలనూ ఇజ్రాయిల్ ఉల్లంఘించడంతోపాటు యుద్ధ నేరాలకూ పాల్పడుతోందని అన్నారు. యుద్ధాన్ని తక్షణం ఆపాలని ఐక్యరాజ్య సమితిలో 120 దేశాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా భారత్ గైర్హాజరవడం మోడీ హయాంలో మారిన భారత విదేశాంగ విధానానికి నిదర్శనమన్నారు. పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలని, ఆ దేశానికి భారత్ అండగా నిలవాలని కోరారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ పాలస్తీనాలోని ఆస్పత్రులు, నివాసాలనూ వదలకుండా 3 లక్షల మంది సైన్యంతో ఇజ్రాయిల్ దాడులు అమానుషమన్నారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు మాట్లాడుతూ ఎక్కడ చూసినా శవాల గుట్టలు, పసిపిల్లల ఆర్తనాథాలతో గాజా ప్రాంతమంతా రోదనగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 75 ఏండ్లుగా పాలస్తీనా భూభాగాన్ని అక్రమించుకుంటూ ఈ యుద్ధం ద్వారా ప్రపంచ పటం నుంచి పాలస్తీనా ఉనికి లేకుండా చేయాలనే సామ్రాజ్యవాద కుట్ర సాగుతోందన్నారు. సమావేశంలో వివిధ పార్టీలు, సంఘల నాయకులు ఎన్.శివకుమార్, బి.శంకరరావు, టి.ప్రతాప్‌రెడ్డి, ఎస్.బాబు, ఎన్.రామసుబ్బాయమ్మ, ఐ.జగదీష్, జరినా సుల్తానా, జమాల్‌బాష, ఎం.రాధాకృష్ణ, ఎన్.కోటేశ్వరరావు, టి.బాబురావు, సుభాని, రమేష్, గౌస్, భగత్‌సింగ్, ముత్తయ్య, అల్లాబక్షు, మోహన్‌రావు, శ్రీనునాయక్, జబ్బార్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి: స్థానిక పుతుంబాక భవన్‌లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల అధ్యక్షత వహించారు. సిపిఎం సత్తెనపల్లి, ముప్పాళ్ల మండల కార్యదర్శులు పి.మహేష్, జి.బాలకృష్ణ, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.హరిపోతురాజు మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ మారణకాండకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే 10 వేలకు మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా వీరిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారని చెప్పారు. దాదాపు 10 లక్షల మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారని అన్నారు. ఈ యుద్ధంలో అమెరికా కిరాతక పాత్ర పోషిస్తోందని, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కును అమెరికా పూర్తిగా కోల్పోయిందని విమర్శించారు. అమెరికా ప్రతి సందర్భంలోను ఇజ్రాయిల్ అరాచకాలకు బాసటగా నిలిచిందని, యుద్ధకాంక్షను ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. తక్షణమే కాల్పులు విరమణ పాటించి, శాంతి నెలకొల్పాలని, ప్రజలకు మానవతా సహాయం అందచేయాలని కోరారు. అయితే ఈ విషయంలో భారతదేశం ఐక్యరాజ్య సమితిలో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. అలీనోద్యమ చరిత్ర ఉండి, గతంలో పాలస్తీనా హక్కుల కోసం నిలబడిన సందర్భాలను మరిచి ఇప్పుడు భిన్నమైన వైఖరిని ఐక్యరాజ్య సమితిలో ఇండియా తీసుకోవడం దేశ ప్రతిష్టకే మచ్చన్నారు. యుద్ధాన్ని తక్షణమే ఆపి, పాలస్తీనాను స్వతంత్రదేశంగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరారు. ఇందుకు ప్రపంచ మానవాళి నుండి స్పందన, ఒత్తిడి, సంఘీభావం పెద్దఎత్తున పెరగాలన్నారు. కార్యక్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్ పి.సూర్యప్రకాశరావు, కె.జగన్మోహన్ రావు, ఎస్.వెంకటేశ్వరరావులు, ఎ.వెంకట్ నారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.