Oct 17,2023 19:46

నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాక్రమణ దాడులు దారుణమని పిడిఎస్‌యు పట్టణ, అధ్యక్ష, కార్యదర్శులు శివ, అశోక్‌ కోరారు. పాలస్తీనా ప్రజలకు ఆహార పదార్థాలను, నిత్యావసర వస్తువులను అందకుండా చేస్తూ అమెరికా సామ్రాజ్యవాద అండతో దురాక్రమణ యుద్ధానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్‌ రోడ్డు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణ దాడులు, యుద్ధం ఫలితంగా 724 మంది చిన్నారులు, 458 మహిళలు మొత్తం 2,215 మంది పాలస్తీనా పౌరులు మరణించారని తెలిపారు. అమెరికా సామ్రాజ్యవాదం అర్బన్‌ దేశాల్లో ఇజ్రాయిల్‌ను తన స్థావరంగా ఉంచుకొని చమురు నిల్వలపై ఆధిపత్యం సాధించడం కోసం, యుద్ధాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. నేడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులన్నీ కూడా నిజానిజాలు తెలియకుండా షేర్‌ చేస్తున్నవేనని చెప్పారు. శరణార్థులుగా ప్రవేశించిన యూదులు నేడు అమెరికా అండతో పాలస్తీనాను ప్రపంచ పటం నుంచి తొలగించడం కోసం దురాక్రమ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇజ్రాయిల్‌ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్‌ వెంటనే వైదొలగాలని డిమాండ్‌ చేశారు. మహిళా సెల్‌ కన్వీనర్లు నిఖిత, కృష్ణవేణి, సాయి, అశోక్‌, ప్రవీణ్‌, నవీన్‌ పాల్గొన్నారు.