రాయచోటి టౌన్ : ఆత్మరక్షణ పేరిట పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమాన్ని తక్షణమే ఆపాలని, కాల్పుల విరమణ అమలు చేయాలని, గాజాలో చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.ఎల్.నరసింహులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజులు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు సగిర్ డిమాండ్ చేశారు. పాలస్తీనాకు మద్దతుగా శుక్రవారం వామపక్షాల రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాయచోటి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యుద్దం వద్దు ప్రపంచ శాంతిని నెలకొల్పాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని నిరదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు కారనంగా మహిళలు పసిపిల్లలు వేలాది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని తెలిపారు. పాలస్తీనా ప్రజలపై యూదుల దురహంకారాన్ని ఇజ్రాయిల్ ప్రదర్శిస్తోందని విమర్శించారు. గాజాలో కిరాతకమైన రీతిలో మారణహోమం సాగిస్తోందని, శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారన్నారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులను హింసించడం, వేదించడం చంపేయడం ద్వారా సమస్య తీవ్రతరం అవుతుందేకానీ సమస్యలు పరిష్కారం కాదన్నారు. ఇజ్రాయిల్‌కు అమెరికా దాని మిత్ర దేశాలు ఆర్థిక,సైనిక, సాయుధ సహాయాన్ని అందిస్తుండటం ఆపేక్షనీయమన్నారు. కాల్పుల విరమణ కోసం స్వరం పెంచడం అనివార్యం అన్నారు.ఇందుకు భారతీయులంతా కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బుక్కే విశ్వనాథ్ నాయక్, సిపిఎం నాయకులు డిసి వెంకటయ్య, నాగబసిరెడ్డి, మాధవయ్య, రెడ్డెయ్య, శేఖర్ నాయక్, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ళ రంగారెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సుదీర్ కుమార్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, సిఐటియు జిల్లా ఉఫాధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, ఎఐటియుసి నాయకులు వెంకటేష్ పాల్గొన్నారు. మదనపల్లె : పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని కండిస్తూ సిపిఐ, జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అనిబిసెంట్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు మురళి, కొన భాస్కర్, తిరుమల, సూరి, మాధవ్, వాసు, ఓబులేసు పాల్గొన్నారు. మొలకలచెరువు : పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. కార్యాక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అంజనప్ప, డిహెచ్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు మంచాల హరికుమార్, లక్ష్మీదేవి, అమరావతి, సుబ్బన్న, శివప్ప, రమణప్ప, కుత్తన్న, నరసింహులు, వేమనారాయణ, చౌడప్ప, ఆనంద, కదిరప్ప పాల్గొన్నారు.