Nov 10,2023 21:20

పార్వతీపురం ర్యాలీ చేస్తున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :  ఇజ్రాయిల్‌కు మోడీ మద్దతు ఇవ్వడం దారుణమని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ దాడులను యావత్‌ భారతదేశం ఖండించాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పాలస్తీనాకు మద్దతుగా పార్వతీపురం పట్టణంలో శుక్రవారం సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌, న్యూ డెమోక్రసీ లిబరేషన్‌, గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు మోడీ ప్రభుత్వం మద్దతు పలకడం దారుణమని తెలిపారు. పాలస్తీనా భూభాగం పాలస్తీనా వారిదేనని గతంలో మహాత్మా గాంధీ కూడా చెప్పారని, ఇప్పుడు అమెరికా మద్దతు పలకడంతో ఇజ్రాయిల్‌ రెచ్చిపోతుందని అన్నారు. ఇప్పటికే పదివేల మందిని పాలస్తీనియన్లను చంపారని, వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పాలస్తీనాకు మోడీ ప్రభుత్వం దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలపాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ ఎంఎల్‌ నాయకులు పి.శ్రీనునాయుడు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు ప్రకారం పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయిల్‌ పూర్తిగా వైదెలగాలని కోరారు. సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు పి.రమణి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తటస్థ వైఖరి విడనాడి పాలస్తీనా ప్రజల కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. లిబరేషన్‌ పార్టీ నాయకులు పి.భాస్కరరావు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద వైఖరిని విడనాడి ఇజ్రాయిల్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. సిపిఐ జిల్లా నాయకులు టి.జీవ మాట్లాడుతూ ఆయిల్‌ గనుల కోసం ఇజ్రాయిల్‌ను అమెరికా, బ్రిటన్‌ పావుగా ఉపయోగించుకొని యుద్ధాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. అఖిలభారత లిబరేషన్‌ పార్టీ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.సంఘం మాట్లాడుతూ గాజాపై దాడులు అత్యంత హేయమైందన్నారు. గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పి రంజిత్‌ కుమార్‌ మాట్లాడారు. సంఘం భావం ర్యాలీ, సభలో సిపిఐ ఎంఎల్‌ నాయకులు భాస్కరరావు (భాష), సర్వేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు బొత్స నర్సింగరావు, అఖిల భారత మహిళా సంఘం నాయకులు దుర్గా చంద్ర చూడామణి, సిపిఎం జిల్లా నాయకులు జి.వెంకటరమణ, కె.సాంబమూర్తి, పట్టణ నాయకులు సంచాన ఉమా, బంకురు సూరిబాబు, రెడ్డి శ్రీదేవి, వి.ఇందిర, తులసి, జి.వెంకటరమణ, విద్యార్థి నాయకులు పండు, రాజు, కళాశీలు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు.