
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మా దేశానికి హద్దులు ప్రకటించండి.. మా పై దాడులు నివారించండి.. మమ్ములను స్వేచ్ఛగా బతకనివ్వండి.. అని పాలస్తీనా వేడుకుంటుంటే వాటికి మతం రంగు పులిమి విధ్వేషాలను బిజెపి రెచ్చగొడుతోందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ విమర్శించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను వెంటనే ఆపాలని, దీనిపై ప్రధాని మోడీ మౌనం వీడి పాలస్తీనాకు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద పాలస్తీనాకు సంఘీభావంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడంతోపాటు కొవ్వొత్తులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజరుకుమార్ మాట్లాడుతూ పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురాగ్రమణను భారతదేశం తొలిననుండీ వ్యతిరేకిస్తోందని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే తాజాగా హమాస్ దాడులను సాకుగా చేసుకుని భారతదేశం తన వైఖరిలో మార్పును ప్రదర్శించిందని అన్నారు. ఈ విషయంలో దేశ ప్రజలను మతోన్మాద బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం, ఆ పార్టీ శ్రేణులు తప్పుదోవ పట్టించాయని విమర్శించారు. పాలస్తీనాపై 25 రోజులుగా సాగుతున్న మారణకాండలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 10 వేల మంది చనిపోయారని, శిధిలాల కింద ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని, గాజాను వదిలి 6 లక్షల మందికి పైగా వెళ్లిపోగా మరో 8 లక్షల మంది ఎక్కడున్నారో కూడా తెలియన దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ దాడులను ఖండించాలన్నారు.యుద్ధాన్ని ఆపేయాలనే ఐక్యరాజ్య సమితి, ఇతర ప్రపంచ దేశాల విజ్ఞప్తినీ ఇజ్రాయిల్ లెక్క చేయడం లేదని, వీరికి అమెరికా మద్దతుగా నిలుస్తోందని దుయ్యబట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ 56 ఏళ్లుగా పాలస్తీనా ప్రాంతంలో అణచివేత జరుగుతోందన్నారు. కాల్పుల విరమణ ప్రకటించి పాలస్తీనాకు సాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డి.శివకుమారి, పట్టణ కార్యదర్శి షేక్ సిలార్ మసూద్, నాయకులు ఇ.మస్తాన్‌రెడ్డి, కె.ఆంజనేయులు, సయ్యద్ రబ్బాని, కె.హనుమంత్‌రెడ్డి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కె.ఏడుకొండలు, స్వరూప్, కె.వెంకయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలో వామపక్ష, ఇతర పార్టీల ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావ ప్రదర్శన చేశారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజల ఊచకోతకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌కు భారత ప్రభుత్వం మద్దతు పలకటం దారుణమన్నారు. ఇది ప్రధాని నరేంద్రమోడీ యుద్దోన్మాదానికి నిదర్శనమని విమర్శించారు. మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు వేలాది మంది ముస్లిమ్ మైనార్టీలను చంపేశారని, ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతును ఉపసంహరించుకుని పాలస్తీనా ప్రజలను ఆదుకోవడానికి, అక్కడ శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని కోరారు. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు లోకం భాస్కర్‌రావు మాట్లాడుతూ పాలిస్తీనా ప్రజలను ఆదుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలన్నారు. వైసిపి మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్కే. సుభాని మాట్లాడుతూ పాలిస్తీనాలో జరుగుతున్నది రెండు మతాల మధ్య గొడవ కాదని జాతుల మధ్య గొడవని అన్నారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, సిపిఐ నాయకులు వై.శివయ్య, ఉపసర్పంచ్ ఎస్.కె నాగూర్ బాష మాట్లాడారు. సిపిఎం నాయకులు వై.బ్రహ్మేశ్వరరావు, ఎన్.యోగేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు కె.కోటేశ్వరరావు, టిడిపి నాయకులు బాష, జాన్ బి, హజీరా, ముక్తార్ మున్నిసా, కరీమున్నిసా పాల్గొన్నారు.