* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాల దృక్పథం కారణంగానే రాష్ట్రంలో పాలనా పరంగా సత్ఫలితాలు వస్తున్నారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో జెసిఎస్ నమోదు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది ఎన్నికల యుద్ధ కాలమని, ఇందులో ప్రతిఒక్కరూ తప్పక పాల్గొనాలన్నారు. నాయకులంతా దిగువ శ్రేణులను కలుపుకొని వెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కరోనా సమయంలో వైసిపి ప్రభుత్వం చేసిన విధంగా ఇతర ఏ ప్రభుత్వాలూ చేయలేదన్నారు. గెలుపే ధ్యేయంగా పనిచేసేందుకు సన్నద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు రఘురాం, ఎఎంసి చైర్మన్ మూకళ్ల తాతబాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్, పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.










