Sep 10,2023 23:46

ప్రజాశక్తి - భట్టిప్రోలు
రాష్ట్రంలో సేనేత సహకార సంఘాలకు గత ఐదేళ్లుగా ఎలాంటి పాలకవర్గం ఎన్నికలు జరగలేదు. నామినేషన్ బోర్డుతో సరిపెడుతున్నారు. ప్రభుత్వం జులై 7 నుండి ఉన్న బోర్డు కూడా పనిచేయకుండా చేశారు. దీంతో సహకార సంఘాల్లో లావాదేవీల సమస్య తీవ్రమైందని చేనేత నాయకులు మురుగుడు సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013ఫిబ్రవరి నెలలో సాగర్ సంఘాలకు ఎన్నికలు జరిపారు. పాలకవర్గ బోర్డు ఏర్పడింది. ఆ పాలకవర్గం 2019ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం ఏడాది కాలం పాటు ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేసింది. లావాదేవీలు కొనసాగించిందని తెలిపారు. తదనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో నామినేషన్ బోర్డును ఏర్పాటు చేసింది. ఆ పాలకవర్గం కూడా ఈ ఏడాది జులై 6తో ముగిసింది. 7తేదీ నుండి సంఘాలకు ఎలాంటి బోర్డు లేకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వైసీపీ పాలన నాలుగేళ్లలో 8విడతలుగా పాలకవర్గం మార్పులు చేర్పులు చేసిందని అన్నారు. ఇలాంటి తరుణంలో  ప్రస్తుతం ఎలాంటి పాలకవర్గంగాని ,స్పెషలాఫీసర్‌నుగానీ లేకపోవడంతో సొసైటీలు లావాదేవీలు నిలిచిపోయి కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంలో కూరుకపోయి కార్మికులకు పూర్తిస్థాయిలో పని లేక  ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రస్తుతం సంఘాలలో లావాదేవీలు లేకపోవడంతో కార్మికులకు అందాల్సిన అరకొర వేతనం కూడా అందటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహకార సంఘాలకు పాలకవర్గం కాని, లేక ప్రత్యేక అధికారులను గాని నియమించి  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.