గోకులం షెడ్లు లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరం
నాలుగేళ్లయినా జమకాని షెడ్ల సొమ్ము
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.12.86 కోట్లు వరకూ బకాయి
కోర్టును ఆశ్రయించిన పలువురు లబ్ధిదారులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'నా పేరు దాసరి సతీష్. ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామం. గత ప్రభుత్వ హాయాంలో ఆరు పశువుల షెడ్డు యూనిట్‌ను గోకులం పథకంలో నిర్మించాను. రూ.లక్షా 80 వేలు రావాల్సి ఉంది. ఎన్‌ఆర్‌ఇజిఎస్ వాటా కింద రూ.ఐదు వేలు జమ చేశారు. మిగిలిన సొమ్ము ఇప్పటి వరకూ రాలేదు. నాలుగేళ్లవుతోంది. ఖర్చు పెట్టిన సొమ్ముకు వడ్డీ తడిసి మోపెడైంది. ఇప్పటికైనా ప్రభుత్వం గోకులం షెడ్డు బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.'
'నా పేరు తమ్మినేని శ్రీనివాసరావు. ఉంగుటూరు మండలం ఎ.గోకవరం. గత ప్రభుత్వ హాయాంలో రూ.లక్షా 80 వేల యూనిట్‌లో మినీ గోకులం షెడ్ నిర్మించాను. ఇప్పటి వరకూ డబ్బు జమ కాలేదు. దీనిపై కోర్టును ఆశ్రయించాను. డబ్బు కోసం ఎదురు చూస్తున్నాం.'
పైన పేర్కొన్న సతీష్, శ్రీనివాసరావులే కాదు. గోకులం షెడ్లు నిర్మించుకున్న దాదాపు 2,500 మందికిపైగా పాడి రైతులు తమకు రావాల్సిన సొమ్ము కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నేతలు మారితే ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము ఆపేయడం ఏ విధంగా సమంజసం అంటూ పాడి రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పశుపోషణను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హాయాంలో గోకులం షెడ్లు నిర్మాణాలను చేపట్టారు. రెండు పశువులకు సంబంధించి షెడ్డు నిర్మాణం చేసుకునే రైతులకు రూ.లక్ష, నాలుగు పశువుల షెడ్డుకు రూ.లక్షా 50 వేలు, ఆరు పశువుల షెడ్డుకు రూ.లక్షా 80 వేలు చొప్పున ఇచ్చేవిధంగా గోకులం షెడ్ల నిర్మాణ పథకం ప్రవేశపెట్టింది. షెడ్డుల నిర్మాణం కోసం 2,728 మంది పాడి రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం రూ.42.79 కోట్లు వరకూ అంచనా వేసి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వం మారేసరికి ఆన్‌లైన్‌లో ఎఫ్‌టిఒ జనరేట్ అయిన లెక్కల ప్రకారం రైతులకు రూ.14.13 కోట్లు వరకూ రావాల్సి ఉంది. దీనిలో లేబర్ ఖర్చుల కింద రూ.కోటి 27 లక్షల వరకూ రావాల్సి ఉండగా, మెటీరియల్ ఖర్చు కింద రూ.12.86 కోట్లు రైతులకు అందాల్సి ఉంది. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద లేబర్ ఖర్చు కింద ఇవ్వాల్సిన సొమ్ము కొంతమేర వచ్చాయి. మెటీరియిల్ ఖర్చుల కింద రావాల్సిన నిధులు రూ.12.86 కోట్లు మాత్రం రైతులకు అందలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీగోకులం సైట్ నిలిపివేయడంతో ఎఫ్‌టిఒ జనరేట్ కాని సొమ్ము దాదాపు రూ.28.65 కోట్లు వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనిలో లేబర్ ఖర్చుల కింద ఇచ్చేది రూ.కోటి 93 లక్షలు వరకూ ఉండగా, మెటీరియల్ ఖర్చు కింద రూ.26.72 కోట్లు వరకూ ఉంది. ప్రభుత్వం గోకులం షెడ్ల బిల్లులు నిలిపివేయడంతో అప్పులు తెచ్చి షెడ్లు నిర్మించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనిపై కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సొమ్ము జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టుకు వెళ్లలేని రైతుల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. రావాల్సిన బకాయిల లెక్కలు చూస్తే గోకులం షెడ్లు విషయంలో రైతులు పెద్దఎత్తున నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం చెప్పినట్లు షెడ్లు నిర్మించుకోవడం తాము చేసిన తప్పా అంటూ పాడి రైతులు లబోదిబోమంటున్నారు. గోకులం షెడ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కోర్టుకు వెళ్లినవారికి మాత్రమే జమ చేస్తారా.. లేక నిర్మాణం చేసుకున్న రైతులందరికీ బకాయిలు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కోర్టుకు వెళ్లిన రైతులకు సొమ్ము జమవుతున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.
మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి
కె.శ్రీనివాస్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు మినీగోకులం షెడ్ల బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం. మూడేళ్లుకుగా పశుసంవర్ధక కార్యాలయాల చుట్టూ పాడి రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేకపోవడం దారుణం. అప్పు చేసి రైతులు గోకులం షెడ్ల నిర్మాణం చేశారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గోకులం షెడ్డు బిల్లులు వెంటనే చెల్లించాలి.










