* కరువు జిల్లాగా ప్రకటించాలి
* సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - నందిగాం, పలాస, రణస్థలం : జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా తదితర జీవనదులున్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతాంగం ఏటా కరువుకు గురవుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అన్నారు. పాలకుల వైఫల్యమే కరువుకు కారణమని విమర్శించారు. వర్షాభావ పరిస్థితులు, కాలువల ద్వారా సాగునీరందక పంటలు ఎండిపోయి కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నందిగాం, పలాస మండలాల్లోని వెంకన్నపేట, బోరుభద్ర, ఆనందపురం, మాదిగాపురం, కామధేనువు, లింగపురం, సవరలింగుపురం, సవరపడదాం తదితర గ్రామాల్లో పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. వర్షాల్లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని చెరువులు, కుంటల్లో ఇంజిన్లు పెట్టి నీరు పెట్టడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగినా, పంట చేతికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణం చేపడితే ఇచ్ఛాపురం వరకు 2.50 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించవచ్చన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యమే కరువుకు కారణమన్నారు. వంశధార ఎడమ కాలువలో గుర్రపుడెక్క, తూటికాడ పిచ్చి మొక్కలతో కాలువలు పేరుకుపోయి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కాలువ నిర్వహణకు నిధులు కేటాయించి ఖరీఫ్ సీజన్‌కు ముందే పనులు పూర్తి చేయాలని అనేకసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ కరువు తీవ్రతను గుర్తించడం లేదన్నారు. జిల్లాలో ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం స్పందించి కరువు తీవ్రతని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి కరువు సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండో పంటకు స్వల్పకాలిక విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, ఉపాధి హామీ పనులు రెట్టింపు చేసి గ్రామాల్లోనే పనులు కల్పించాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎన్.షణ్ముఖరావు, పి.సాంబమూర్తి, బి.వాసుదేవరావు, హనుమంతు ఈశ్వరరావు, కొర్నాన బాలాజీరావు, రైతులు సంపతరావు, గోపాల్, నరసింహ మద్దిల తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వర్షాభావం, తెగుళ్లతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. రణస్థలం మండలంలోని కొండములగాం, కమ్మసిగడాం, వేల్పురాయి, బంటుపల్లి, కంబాలపేటలో నీరు లేక ఎండిపోయిన, తెగుళ్లు సోకిన పంటలను, సాగు చేయకుండా ఉంచేసిన పోలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో, నిర్వహణ లేక పొలాలకు సాగునీరు అందలేదని తెలిపారు. తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులు ఉన్నా సాగునీరు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వర్షాలు లేక పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, 20 శాతం దిగుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని సర్వే చేసి కరువు పరిస్థితి అంచనా వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయంగా రెండో పంటకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలన్నారు. రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చు, కుటుంబ శ్రమ విలువకు మరో 50 శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేసారు. అన్నిరకాల రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని, పంటల బీమా రైతులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు దన్నాన అప్పలనాయుడు, రెడ్డి రామినాయుడు, కొంచాడ అప్పలనాయుడు, మజ్జి.రమణ తదితరులు ఉన్నారు.