Jul 14,2023 19:22

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం హాలహర్వి నాయకులు కృష్ణ

ప్రజాశక్తి - ఆలూరు
ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి, వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం జ్యోతిబసు భవన్‌లో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై సిపిఎం ఆధ్వర్యంలో రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు కెపి.నారాయణ స్వామి అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ... వేదవతి, నగరడోన రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాలని వామపక్షాలు ధర్నాలు, పాదయాత్రలు, ఆందోళనలు చేపడితే కేసులు బనాయించారని తెలిపారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాలు రిజర్వాయర్‌ నిర్మాణానికి అరకొర నిధులు మంజూరు చేసి కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ఎంఆర్‌పిఎస్‌ తాలూకా నాయకులు కత్తి రామాంజనేయులు మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో ప్రభుత్వ జూనియర్‌, అంబేద్కర్‌ గురుకుల బాలుర గురుకులంలో బైపిసి, ఎంపిసి కోర్సులు ఏర్పాటు చేయాలని కోరారు. హోళగుంద ఎస్సీ హాస్టల్‌ను పునః ప్రారంభించాలన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహానంది మాట్లాడుతూ... జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి నీరు అరకొరగా వస్తున్నా కర్ణాటకలో 'అప్పర్‌భద్ర' ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ ప్రాంత రైతులకు సాగునీరు, ప్రజల తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపారు. నియోజకవర్గంలో దళితులపై దాడులను అరికట్టాలని కోరారు. సిపిఎం హాలహర్వి నాయకులు కృష్ణ మాట్లాడుతూ... మండలంలో బాపురం, చింతకుంట స్కీంలు ఉన్నా 10 నుంచి 15 రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో బిటి రోడ్లు, తెగిన బ్రిడ్జిలు వేయాలని కోరారు. పాలకులకు, అధికారులకు విన్నవించినా చలనం లేదన్నారు. రైతుసంఘం మండల కార్యదర్శి ఈరన్న మాట్లాడుతూ... రైతులకు పంట నష్టపరిహారం సక్రమంగా ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. పండిన అరకొర పంటలను జింకలు నాశనం చేస్తున్నాయని తెలిపారు. పాలకులు హామీలకే పరిమితమయ్యారని, ఆచరణలో ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని విమర్శించారు. సిపిఎం మండల కార్యదర్శి షాకీర్‌ మాట్లాడుతూ... సాగు, తాగునీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, ఐటిఐ, గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలకు, మేనేజ్‌మెంట్‌ మహిళ, బాలుర వసతి గృహాలకు స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించాలని కోరారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే టిటిసి ట్రైనింగ్‌ సెంటర్‌, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయని విమర్శించారు. కళాశాలలో ఆదనపు కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలూరు మార్కెట్‌ యార్డులో మార్కెటింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదోని నుంచి కర్నూలు కలెక్టరేట్‌ 31 వరకు మహా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. నేటి నుంచి 22 వరకు వరకు గ్రామగ్రామాన జీపుజాతా నిర్వహించి రైతులను, ప్రజలను, యువతను చైతన్యం చేసి, మహా పాదయాత్రతో ప్రభుత్వం, పాలకుల మెడలు వంచి అభివృద్ధికి బాటలు వేసుకుందామని కోరారు. సిపిఎం హోళగుంద మండల నాయకులు వెంకటేశులు, తెలుగు యువత నాయకులు రాజశేఖర్‌, వ్యకాస చిప్పగిరి నాయకులు ఈరన్న, సిఐటియు నాయకులు శేఖర్‌, నాగరాజు, విఠల్‌, వీరేష్‌, డివైఎఫ్‌ఐ నాయకులు మైనా, గోవర్ధన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గిరిమూర్తి పాల్గొన్నారు.