Nov 03,2023 21:07

విజయనగరం సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం


 

కోలాటంతో నాయకులకు స్వాగతం పలుకుతున్న కళాకారులు
కోలాటంతో నాయకులకు స్వాగతం పలుకుతున్న కళాకారులు

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌, పూసపాటిరేగ, జామి, శృంగవరపుకోట, కొత్తవలస : ఎన్నో సహజ వనరులు, సారవంతమైన భూములు ఉన్నా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల జిల్లా అత్యంత వెనుకబడిపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, వై.వెంకటేశ్వరరావు అన్నారు. మరోవైపు రాష్ట్రానికి మోసం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. ప్రశ్నిస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా బిజెపి వద్ద నోరు మెదపడం లేదన్నారు. ఈనేపథ్యంలో జనసేన కార్యకర్తలు లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారక్షణ భేరి ముగింపు సందర్భంగా ఈనెల 15న విజయవాడలో జరగబోయే బహిరంగ సభకు ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.

మందసలో ఈనెల 2న ప్రారంభమైన ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర శుక్రవారం విజయనగరం జిల్లాలో సాగింది. పూసపాటిరేగ, విజయనగరం, జామి, కొత్తవలస, ఎస్‌.కోట మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించింది.విజయనగరంలో కోట వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో లోకనాథం, వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. దీంతో, జిల్లాలోని తోటపల్లి లక్ష్యానికి అనుగుణంగా సాగునీరు అందించలేక పోతోందన్నారు. తారకరామతీర్థసాగర్‌ అసంపూర్తిగా ఉండడం వల్ల నెల్లిమర్ల నియోజకవర్గవాసులు 18ఏళ్లగా ఎదురు చూస్తున్నా సాగునీరు అందలేదని, విజయనగరం పట్టణానికి తాగునీరు కూడా వచ్చే పరిస్థితి లేదని వివరించారు. సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మించి జిల్లాను ససశ్యామలం చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలాయన్నారు. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని సహకార రంగంలోకి తీసుకొస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరలేదు సరికదా ఆధునీకరణ పేరుతో ఫ్యాక్టరీని మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలిలోని ఎన్‌సిఎస్‌ సుగర్స్‌ యాజమాన్యం నుంచి బకాయిలు ఇప్పించాలని రైతులు ఆందోళన చేస్తే, ఆ పేరుతో ఫ్యాక్టరీ భూములను విక్రయించి, అసలుకే ఎసరు పెట్టారన్నారు. దీంతో, వందల కిలోమీటర్ల దూరంలోవున్న సంకిలి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్‌ సంస్కరణవల్ల విద్యుత్‌ భారాల మోయలేని ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు ఆర్థికంగా కుదేలై చాలా వరకు మూత పడ్డాయని, మరికొన్ని ఆ దిశగానే ఉన్నాయని అన్నారు. ఫలితంగా వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

పూసపాటిరేగలో సమస్యలపై వినతులు ఇస్తున్న ఆశా కార్యకర్తలు
పూసపాటిరేగలో సమస్యలపై వినతులు ఇస్తున్న ఆశా కార్యకర్తలు

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా రంగంలో స్కూళ్లను మెర్జిచేసి, ఉపాధ్యాయ పోస్టులను కుదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల నుంచి కార్మికుల నిజ వేతనాలు పడి పోయాయన్నారు. 13ఏళ్లుగా కనీస వేతనాలలో సవరణ లేదన్నారు. బానిసలుగా పని చేయించుకొని చాలీచాలని వేతనాలతో బతకాల్సి వస్తుందన్నారు. అన్ని రంగాల్లో పని చేస్తున్న వారికి, స్కీమ్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభావతి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ జోడీలు ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ అడిగింది తొలుత కమ్యూనిస్టులేని, ఇటీవల పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన బిజెపి 2024 ఎన్నికల్లో అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు మూతపడిన, ప్రభుత్వ పరిశ్రమలు అమ్మేస్తున్నా మంత్రి బొత్సకు పట్టడం లేదన్నారు. మన సమస్యల పరిష్కారం కోసం మనమే పోరాడాలని, ఇటువంటి పోరాటాలు నిర్వహించే సిపిఎం అండగా ప్రజలు నిలబడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు బస్సు యాత్ర తో వచ్చిన ప్రజా నాట్యమండలి కళారూపాలు, విప్లవ గేయాలు, ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి నాగేశ్వరరావు, బి.ప్రభావతి, కె.ధనలక్ష్మి, హరిబాబు, జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టివి రమణ, వి.లక్ష్మి జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం బందానికి వినతులు
సిపిఎం బృందానికి సమస్యల పరిష్కారం కోసం పలువురు వినతులు ఇచ్చారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హీల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, విఆర్‌ఎలు, డివైఎఫ్‌ ఐ, ఎస్‌ఎఫ్‌ ఐ, ఎపి బేవరేజ్‌స్‌ సంఘం నాయకులు, ఆర్‌టిసి అద్దె బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలపై వినతులు అందజేశారు. ఎల్‌బిజి నగర్‌, గురజాడ నగర్‌, రామకష్ణ నగర్‌, బాబామెట్ట, సుందరయ్య కాలనీ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
భీమసింగి మూతతో చెరకు రైతులకు అన్యాయం
జామి మండల కేంద్రానికి చేరుకున్న ప్రజారక్షణ భేరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్‌ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నా భోజన కార్మికులు, చెరుకు రైతులు స్వాగతం పలికారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం మూసివేతతో ఈ ప్రాంత చెరుకు రైతులకు తీవ్ర అన్య్యాయం జరిగిందని, తక్షణమే ఫ్యాక్టరీ తెరిపించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ నాయకులకు రైతులు వినతులు అందజేశారు. అంగన్‌ వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు సైతం తమ సమస్యలపై వినతులు అందజేశారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిత్యావసర ధరలు తగ్గించి ప్రజానీకాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ రూ.400, పెట్రోల్‌, డీజిల్‌ లీటరు రూ.60కే అందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ కోసం తప్ప పేదల కోసం పని చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ, జామి లో అగ్రహారం భూ సమస్యను పరిష్కరించి, సాగులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌.కోటలో వినతులు స్వీకరిస్తున్న సిపిఎం నాయకులు
ఎస్‌.కోటలో వినతులు స్వీకరిస్తున్న సిపిఎం నాయకులు


ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు దోచి పెడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.హరిబాబు అన్నారు.ఎస్‌.కోట చేరుకున్న బస్సుయాత్ర బృందానికి విద్యార్థులు, కార్మికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎం హరిబాబు మాట్లాడుతూ. కేంద్రంలో మోడీ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్‌ కళ్యాణ్‌ గాని నోరు మెదపటం లేదని అన్నారు. సిపిఎం నాయకులకు పోలవరం కాలువలో భూమిపోయిన రైతులు, బైపాస్‌ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులు, ఏళ్ల తరబడి దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులు గ్రీన్‌ అంబాసిడర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని వినతులను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు బుద్ధరాజు రాంబాబు, చల్ల జగన్‌, మద్దిల రమణ తదితరులు పాల్గొన్నారు.
ఎర్ర జెండా బలపడటంతోనే ప్రజలకు మేలు
సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రకు కొత్తవలస మండల కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి 9 ఏళ్లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క అంశాన్ని అమలు చేయని బిజెపికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు నిలబడాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి, కార్మిక హక్కులను కాలరాసి, కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టే బిజెపికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ది కోసం పోరాడుతున్న సిపిఎం వెంట ప్రజలు నడవాలని పిలుపు నిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభావతి మాట్లాడుతూ మహిళల కు సమన హక్కుల కోసం, అసమానతలు రూపు మాపేందుకు సిపిఎం చేసే పోరాటంలో మహిళలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ సిపిఎంగా స్థానిక సమస్యలపైన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజారక్షణ భేరీకి ఘన స్వాతం
జిల్లాలో ప్రవేశించిన ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర నాయకులకు పూసపాటిరేగలో సిపిఎం అభిమానులు, కార్యకర్తలు, స్కీమ్‌వర్కర్లు, విద్యార్థులు, రైతులు, పైడిభీమవరం ప్రాంతానికి చెందిన కార్మికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు నాయకులకు నుదుటన తిలకం దిద్ది హారతిపట్టారు. అనంతరం నగరానికి చేరుకున్న బృందానికి గుమ్చీ సెంటర్‌లో సిపిఎం కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు కోలాటంతో స్వాతం పలికారు. అక్కడి నుంచి కోట వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. యువతీ, యువకులు కోలాటంతో అలరించారు. సభ అనంతరం పాత ఎయు క్యాంపస్‌ భవనంలో నిర్వహిస్తున్న గిరిజన వర్శిటీని నాయకులు సందర్శించారు. తరువాత భీమసింగి, జామి మీదుగా ఎస్‌కోట, అక్కడి నుంచి కొత్తవలస వరకు ప్రజారక్షణభేరి యాత్ర సాగింది. ఈ సందర్భంగా అన్నిచోట్లా వివిధ తరగతులకు చెందిన ప్రజానీకం నాయకులకు వినతిపత్రాలు అందజేశారు.