
బిజెపితో భారత రాజ్యాంగానికి తూట్లు
వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రజలకు ఏం
చేస్తున్నాయో తెలపాలి
4సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్రలో వక్తలు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
పాలకులు చెబుతున్న మాయమాటలను, మోసపూరిత ప్రకటనలను, హామీలను ప్రజలు గమనించాలని సిపిఎం ప్రజారక్షణ భేరి యాత్రలో పలువురు వక్తలు అన్నారు. ప్రజా రక్షణభేరి బస్సు యాత్ర ఆదివారం కాకినాడ జిల్లాకు చేరుకుంది. అనకాపల్లి జిల్లా నుంచి వచ్చిన యాత్ర బందానికి తుని గొల్ల అప్పారావు సెంటర్లో ఘనంగా స్వాగతం లభించింది. సిపిఎం, సిఐటియు, అంగన్వాడి, ఆశ జీడి పిక్కల పరిశ్రమ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై యాత్ర నాయకులకు పూలమాలతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి అన్నవరం, కత్తిపూడి,చేబ్రోలు, గొల్లప్రోలు మీదుగా సాయంత్రం పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ కు చేరుకుంది. ఈ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. అక్కడ నుంచి కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం, బానుగుడి జంక్షన్ మీదుగా కాకినాడ అంబేడ్కర్ విగ్రహ సమీపంలో ఉన్న ట్యాక్సీ స్టాండ్ వద్దకు చేరుకుంది.
సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం మాట్లాడారు. బిజెపి వల్ల దేశానికి, రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ప్రజలకు తెలియజేసి పలు ప్రత్యామ్నాయాలను సూచించేందుకే ఈ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదాని, అంబానీ, రిలయన్స్ వంటి బడా సంస్థలకు దేశ సంపదను కట్టబడుతున్న వైనాన్ని ఆయన సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న ద్రోహాన్ని వివరించారు. సిపిఎం సూచిస్తున్న ప్రత్యామ్నాయల్లో భాగంగా నిరుపేదలకు రెండున్నర ఎకరాలు భూములు పంచాలని డిమాండ్ చేశారు. ఎటువంటి భారాలు లేకుండా ఇళ్లను నిర్మించి ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. పాత పెన్షన్ స్కీమును అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా జగన్ అమలు చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయని పక్షంలో నిరుద్యోగ భతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని వివరించారు. ప్రజలపై చార్జీల భారం విపరీతంగా పెరుగుతుందన్నారు. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను, రాజకీయ పరిణామాలను వివరిస్తూ బస్సు యాత్ర సాగుతుందన్నారు. విభజన హామీలను ఏమాత్రం అమలు చేయని బీజేపీని అందరూ వ్యతిరేకించాలన్నారు. జిల్లాలో అపారమైన గ్యాస్, చమురు నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలను దోచిపెడుతున్నారన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి. నాగేశ్వరరావు, కె.ధనలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో అనేక అసమానతలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందడం లేదన్నారు. ఒక్క రూపాయికి యూనిట్ విద్యుత్, రూ.400కే గ్యాస్ ఇవ్వచ్చని సిపిఎం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలను ప్రజల ఆలోచించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రూ.600 వేతనంగా ఇవ్వాలన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలన్నారు. స్వామినాథన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలనానరు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం సిఎం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కరువు మండలాల ప్రకటనలో కూడా అన్యాయం చేశారన్నారు. 98 శాతం హామీలను అమలు చేశామని గొప్పలు చెబుతున్న జగన్ స్కీం వర్కర్లకు కనీస వేతనాలను ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం లేదన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇలా అనేక అంశాలను విస్మరించి జగన్ మాట తప్పారని ఎద్దేవా చేశారు.
సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ రౌతులపూడి మండలంలో సబ్ ప్లాన్ గిరిజనుల సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదన్నారు. ఎనిమిది మండలాల్లో ఏలేరు రైతులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా పాలకులకు పట్టడం లేదన్నారు. కాకినాడ సెజ్ భూముల రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదన్నారు. దివీస్ కంపెనీని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. మెట్ట మండలాల్లో పెద్ద ఎత్తున కరువు పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పిఠాపురం, కాకినాడ సభల్లో ప్రయాణికులు, వాహన చోదకులు, వ్యాపారులు ఆద్యంతం నాయకుల ప్రసంగాలను ఆలకించారు. ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఉపాధ్యాయులు ఆయా సమస్యలపై యాత్ర బందానికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు దువ్వా శేషాబాబ్జి, జి.బేబిరాణి, కెఎస్.శ్రీనివాస్, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు బాలకృష్ణ, కె.సింహాచలం, కుంచే చిన్న, కోనేటి రాజు, కరణం విశ్వనాథం, సిహెచ్ రమణి, పద్మ, ఈశ్వరి, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.