పాలకుల చేతగాని తనంతో కర్నూలు కరువు
ప్రాజెక్టుల నిర్మాణం డిమాండు కొత్తతి కాదు
7న మహా ధర్నాను జయప్రదం చేయండి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్
ప్రజాశక్తి - కోడుమూరు
పాలకుల చేతగాని తనంతోనే కర్నూలు కరువుకు కారణమని, ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కోరడం అనేది ఇప్పటి సమస్య కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ అన్నారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాదయాత్ర నాల్గవ రోజు కోడుమూరు పట్టణం నుండి ప్రారంభమై ప్యాలకుర్తి, రామచంద్రపురం (కొత్తూరు), పెంచికలపాడు మీదుగా నాగలాపురం చేరింది. ప్యాలకుర్తింలో కోడుమూరు మండల కార్యదర్శి ఎస్‌ఎంఎ.గఫూర్ మియా అధ్యక్షతన జరిగిన బహిరంగసభను ఉద్దేశించి వి.రాంభూపాల్ మాట్లాడారు.
ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత, ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిషనే ప్రాజెక్టుల నిర్మానం ప్రాధాన్యత గురించి తేల్చి చెప్పిందని, కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీల చేతగానితనం కారణంగానే కర్నూలు జిల్లా మరింత కరువు కోరలలో చిక్కుకుందని తెలిపారు.
విడిపోయిన రాష్ట్రం అభివృద్ధి కావడానికి ప్రత్యేక హోదాను ఇవ్వడంతో పాటు, రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు తేల్చి చెప్పినా నేటికీ అమలుకు నోచుకోకపోవడం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేల చేతగాని తనమే ప్రధాన కారణమని విమర్శించారు. రాష్ట్రాల ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తీసుకొచ్చి పెడుతోందన్నారు. డబుల్ ఇంజన్ పేరుతోటి రాష్ట్రాల్లోనూ అధికారాన్ని అప్పజెప్పితే మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని బీరాలకు పోయే బిజెపి ప్రభుత్వం ఇప్పటికే అధికారంలో ఉన్న మణిపూర్ రాష్ట్ర అగ్గిలా మండుతుందన్నారు. వేలాది మంది పురుషుల మధ్య ఆడపిల్లల బట్టలూడదీసి తిప్పి అత్యాచారం చేసిన ఘటనను బయటికి రానివ్వకుండా అడ్డుకున్న ఘనత ఈ డబుల్ ఇంజన్ సర్కార్‌దేనని అన్నారు. అంతటితో ఆగక ఆ మంటలు పక్కనున్న రాజస్థాన్‌కు, హర్యానాకు కూడా అంటుకున్నాయన్నారు. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తూ, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి, జిల్లాలను కష్టాల ఊబిలోకి నెట్టిన బిజెపిపై పోరాడకుండా వైసిపి టిడిపిలు దాని పాదాల చెంతన చేరి భజన చేస్తున్నాయన్నారు. మరో పార్టీ పెట్టి ప్రశ్నించడమే నాపని అన్న నాయకుడు కొన్ని రోజులు చేగువేరా ఫొటో పెట్టి వామపక్షాలతో వచ్చాడన్నారు. ప్రత్యేక హోదా పట్ల కేంద్ర ప్రభుత్వం పాచిపోయిన లడ్డును చేతిలో పెట్టిందన్నారని, మనమైతే పాచిపోయిన లడ్డును చెత్త కుప్పలో పడేస్తామని, కానీ నేడు జనసేనాని ఆ పాచిపోయిన లడ్డునే భుజాలపైన ఎత్తుకొని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రం జిల్లా ఎండిపోయినా పర్వాలేదు మా కడుపులు నిండితే చాలు అనుకున్న ఈ పాలకుల విధానాలను ఎండగట్టాలన్నారు. కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధిని కోరుతూ సిపిఎం నిర్వహించే ఈ మహా పాదయాత్రను బలపరిచి, 7న కలెక్టరేట్ ముందు జరిగే మహాధర్నాలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహా పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, జి.రామకష్ణ, వెంకటేషులు, కెవి.నారాయణ, జిల్లా నాయకులు ఎండి.ఆనంద్ బాబు, వీరశేఖర్, నగేష్, గురుశేఖర్, విజరు, అబ్దుల్లా, రాఘవేంద్ర, జె.మోహన్, విజయమ్మ, నరసింహులు, స్వాములు, కృష్ణ, కరుణాకర్, శేషాద్రి, ఈరన్న తోపాటు మరో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాపాదయాత్ర అపూర్వ ఆదరణ
మహాపాదయాత్ర ఈనెల 2న తొలిరోజున ప్రారంభానికి ఆదోనిలో వేలాది మంది తరలి వచ్చారు. దారిపొడవునా మహాపాదయాత్రపై పూలు జల్లారు. ఆర్‌పిలు, అంగన్‌వాడీలు, కార్మికులు, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని వినతిపత్రాలు ఇచ్చారు.
శుక్రవారం గూడూరు మండలం పెంచికల పాడులో కార్మికులు, మహిళలు, ఆశాలు, ఆర్‌పిలు మహాపాదయాత్రకు భారీ స్వాగతం పలికారు. పాదయాత్రలో ఆదోని నుంచి నడుచుకుంటూ వచ్చిన సిపిఎం నాయకులకు పూలదండువేశారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి పెంచికల పాడు వరకు పాదయాత్ర వర్షంలోనే కొనసాగింది. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని, పరిశ్రమలు నెలకొల్పాలని, రైతులను ఆదుకోవాలని జిల్లా సమగ్రాభివృద్ధికి రూ10వేల కోట్లు కేటాయించాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగింది. ఆయా సెంటర్లలో ప్రజలనుద్దేశించి సిపిఎం నాయకులు మాట్లాడారు. విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేశారు.












