Feb 08,2023 23:29

మాట్లాడుతున్న రాంబాబు, చిత్రంలో అప్పారావు, బాలకృష్ణ

ప్రజాశక్తి- అనకాపల్లి
పాలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పాల ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంబాబు డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో బుధవారం జరిగిన ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు లీటరుకు నాలుగు రూపాయలు మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చారని, మూడున్నరేళ్లు దాటుతున్న ఆ హామీ నెరవేర్చలేదని తెలిపారు. కేరళ ప్రభుత్వం లీటరు ఒక్కంటికి రూ.34 చొప్పున ఏడాదికి వెయ్యి లీటర్లు సరఫరా చేసిన వారికి అదనంగా రూ.34 వేలు అందిస్తుందని తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో పాల ఉత్పత్తిదారుల సంఖ్య పెరిగిందన్నారు. సంఘం నాయకులు కర్రి అప్పారావు, ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. విశాఖ డెయిరీ పాడి రైతులకు లీటరుకు పది రూపాయలు చెల్లించాలని, సహకార రంగంలో కొనసాగించాలని కోరారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.