May 02,2021 07:31

వ్యక్తిగతంగానూ స్తోమత గల బడా నేతలు స్వంత వేదికలను స్పాన్సర్‌ చేసుకుంటుంటారు. సాధారణంగా మత ఛాందసం, హిందూత్వ పోకడల వంటి విషయాలలోనూ ఇవి పాక్షికంగానే వ్యవహరిస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు సంబంధించి ప్రాంతీయ ధోరణులకు పెద్ద పీట వేయడానికి కూడా వెనకాడవు. ఇక ప్రజాస్వామిక విలువలు, ఉద్యమాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల, శ్రామిక వర్గ హక్కుల పట్ల ఆసక్తి అసలే నాస్తి. ఎప్పుడు ఏ ఎజెండాను తీసుకు రావాలి, ఎవరిని లక్ష్యంగా దాడి సాగించాలనేది ముందే నిర్ణయమైపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది.
   మీడియా ద్వంద్వ స్వభావం, దానిపై పాలకుల ఒత్తిళ్లు, పాచికలు, దాని ద్వారా సాగించే పథకాలు, ప్రచారాలు దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత బాహాటంగా అర్థమవుతున్నాయి. మీడియా, సోషల్‌ మీడియాలలో వచ్చే కథనాలు, రాని కథనాలు, వాటి కారణాలు, కల్పనలు ఇప్పుడు పాఠకులు, వీక్షకులు కూడా పరిశీలించి చూడక తప్పడం లేదు. అసలు ఒక పత్రిక లోనో ఛానల్‌ లోనో వచ్చింది మాత్రమే చూసి ఇదే నిజమనుకునే దశ ఎప్పుడో పోయింది. అంతర్జాతీయ మీడియాలో అంగీకార సృష్టి పేరిట నామ్‌చోమ్‌స్కీ వంటి వారు లేదంటే ఇండియాలో పాలగుమ్మి సాయినాథ్‌ ఎన్‌.రామ్‌ వంటివారు గతంలో చెప్పిన పాఠాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమవుతున్నాయి. ఇరాక్‌ యుద్ధ సమయంలో బిబిసి సీనియర్‌ జర్నలిస్టు ఒకరు అసత్యాలు చెప్పలేక అంతరాత్మ ఘర్షణ తట్టుకోలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు టైమ్స్‌ నౌ జర్నలిస్టుల బృందం కూడా తమ ప్రధాన యాంకర్లకు బహిరంగ లేఖ రాయడం అచ్చంగా ఆ సన్నివేశాన్నే గుర్తు చేసింది. దేశంలో బడా మీడియా (నరేంద్ర) మోడియాగా మారిపోయిందని ఒకప్పుడు మాలాంటి వాళ్లం చేసిన చమత్కారం ఎంత నిజమో 'టైమ్స్‌ నౌ' బృందం లేఖ నిరూపించింది. మనం ఇంత కాలంలో కేంద్రంపై ఒక్క విమర్శనాత్మక చర్చ అయినా చేశామా అని వారు తమ నిర్వాహకులను ప్రశ్నించారు. కోవిడ్‌ వ్యాపిస్తున్న సమయంలో అందుకు భారీ సభల కారణమంటూ ప్రతిపక్ష సభలు చూపామే గాని బెంగాల్‌లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా జరిపిన భారీ ర్యాలీల ఫోటోలు చూపామా అని ప్రశ్నించారు. మనం కొంచెం వెనక్కు వెళ్లి ఆర్నబ్‌ గోస్వామి ఉదంతం గుర్తు చేసుకుంటే మొత్తం మోడీ బృందం ఆయనను కాపాడేందుకు ఎంతగా పరితపించిందో సుప్రీం కోర్టు కూడా అసాధారణంగా ఎలా జోక్యం చేసుకుందో కనిపిస్తుంది. 'టైమ్స్‌ నౌ' కు కొన్ని రెట్లు ఎక్కువగా ఆయన రిపబ్లిక్‌ టీవీ నేరుగా మోడీ బాకా గా వ్యవహరించింది. మర్కజ్‌, చైనాతో వివాదం, ప్రతిపక్షాల వ్యాఖ్యల వంటి విషయాలలో రాద్ధాంతం చేసింది. అంతేగాని కేంద్రాన్ని ఎప్పుడూ ప్రశ్నించిన పాపాన పోలేదు.

                                                   కోవిడ్‌పై పోరాటంలో అతిశయోక్తులు

   కోవిడ్‌-19 విషయంలోనూ కేంద్రం వైఫల్యాలను మీడియా మొదట దాచిపెట్టిందే తప్ప విమర్శనాత్మకంగా వెల్లడించలేదు. చైనా నుంచి వచ్చిందనే కథలకు పెద్ద పీట వేసింది. అంతకంతకూ కేసులు పెరిగి పరిస్థితి చేయి దాటిపోతుంటే అప్పుడు మరోవైపు నుంచి కూడా కథనాలు ఇవ్వడం మొదలెట్టింది. ఆ సమయంలోనే కోవిడ్‌ రెండవ దశ అవకాశాలను నిపుణులు చెబుతుంటే మీడియా ఉపేక్షించింది. వ్యాక్సిన్‌ విజయాల ప్రచారానికి వాహికగా మారింది. సెకండ్‌ వేవ్‌లో చికిత్స, మందులు, రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌ వంటివి కూడా అందక దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి చేరుతుంటే అప్పుడు కళ్లు తెరిచింది. అయితే ఆత్మ విశ్వాసం కలిగించాలిగాని మీడియా విమర్శనాత్మక కథలు ఎక్కువగా ప్రచారం చేయకూడదని ప్రభుత్వం సుద్దులు చెప్పింది. సోషల్‌ మీడియా లోనూ ఆ విధమైన కథనాలు రాకుండా కట్టడి చేసింది. వంద మంది సోషల్‌ మీడియా ఖాతాలు ట్విట్టర్‌ అకౌంట్లు ఆపించింది. సీనియర్‌ జర్నలిస్టులకూ తాఖీదులు ఇచ్చింది. దేశద్రోహం వంటి ఆరోపణలు కూడా చేయించింది. ఇదంతా ఇటీవలి వ్యవహారమే. ఇంకా కొనసాగుతున్నది కూడా.
 

                                                           సిద్దిక్‌ కప్పన్‌పై కక్ష

   ఇదే సమయంలో కేరళకు చెందిన సిద్దిక్‌ కప్పన్‌ యు.పి లోని హత్రాస్‌ ఘోర అత్యాచారం ఘటనను నివేదించేందుకు బయిలుదేరితే ఆయనపైనా ఇలాంటి ఆరోపణలే మోపి జైలు పాలు చేసింది. ఆయన భార్య, జర్నలిస్టు సంఘాలు ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్నాబ్‌ గోస్వామి విషయంలో ఆగమేఘాల మీద జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు కప్పన్‌కు వచ్చేసరికి హైకోర్టు లోనే అప్పీలు చేసుకొమ్మని ఆదేశించింది. చివరకు ఆయనకు కరోనా సోకితే ఆస్పత్రిలో జంతువు లాగా బెడ్‌కు కట్టేశారని ఆయన భార్య పిటిషన్‌ దాఖలు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తికి చేశారు. ఈ పూర్వ రంగంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ధర్మాసనం సిద్దిక్‌ కప్పన్‌ను యు.పి నుంచి ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించవలసిందిగా ఆదేశాలిచ్చింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా దీనిపై ఎంతగా నిరసన తెలిపారంటే దేశంలో ఎందరో వృద్ధులు, ఆక్సిజన్‌ అవసరమైన వారు ఆస్పత్రి సదుపాయం దొరక్క అవస్థ పడుతుంటే కప్పన్‌ను అనవసరంగా మీరు ఢిల్లీకి తరలించమంటున్నారని అభ్యంతరం చెప్పారు. మానవీయ కోణంలో ఆయనకు మెరుగైన చికిత్స లభించేలా మాత్రమే చేస్తున్నామని సిజెఐ ఆయనకు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఈ కాలంలోనే ఫ్రాన్స్‌లో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాల గురించి భారతీయ దళారికి భారీగా ముడుపులు ఇవ్వడం గురించి సాధికారిక సమాచారం వచ్చింది. ఒకప్పుడు బోఫోర్స్‌, 2జి కేసు వంటి వాటి గురించి అత్యుత్సాహంతో కథనాలు ఇచ్చిన బడా మీడియా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా తొక్కిపట్టింది.
 

                                                           సుప్రీం కోర్టు అభ్యంతరం

   కోవిడ్‌-19కు సంబంధించి ఏవైనా పోస్టులు, వ్యతిరేక పోస్టులు రాకుండా ఆపడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ చేస్తే సుప్రీం కోర్టు అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. బాధితులుగా వారు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటే మీరు స్పందించాలేగాని శిక్షించడం ఏమిటని ఆక్షేపించింది. వ్యాక్సిన్‌ గురించి వైద్య సదుపాయాల లోటు గురించి వచ్చిన కథనాలను దాదాపు ధృవీకరిస్తూ సుప్రీం కోర్టు రాష్ట్రాల హైకోర్టులు కూడా ప్రభుత్వాలను చివాట్లు పెడుతూనే వున్నాయి. అయితే మీడియాలో వాటిని ఆ స్థాయిలో చూపించారా అంటే అది ఎంతమాత్రం జరగలేదు. విడివిడిగా వార్తా కథనాలు ఇచ్చినా వాటికి కారణమైన విధాన లోపాలను, తప్పులను ఎత్తిచూపిన దాఖలాలే వుండవు. మోడీ రాజీనామా చేయాలంటూ ఒక హాష్‌ ట్యాగ్‌కు ఆదరణ బాగా రావడంతో దాన్నీ తొలగింపచేశారు. ఇదేమిటని నిరసన వచ్చాక మా ప్రమేయం లేదని కేంద్రం విడగొట్టుకుంది. ఫేస్‌బుక్‌ టీమ్‌ దాన్ని తామే తొలగించాం గాని ప్రభుత్వం కోరలేదని ప్రకటించింది. ఇదంతా ఒక మాయాజాలం. ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లను నడిపే అంతర్జాతీయ సంస్థలు కూడా దాగుడు మూతలాడుతూ తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకుంటాయి. వీటిని ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం విమర్శలకు చోటు వుండే మాట నిజమే. ఆ హక్కును కాపాడుకోవలసిందే. అదే సమయంలో మీడియానే శాసించే బడా పాలక పార్టీలకు సోషల్‌ మీడియాను ప్రభావితం చేయడం పెద్ద పని కాదు.
 

                                                      తెలుగులోనూ అదే తంతు

   ఉదాహరణకు తెలుగులో చూస్తే పత్రికలు, ఛానళ్లతో పాటు సోషల్‌ మీడియాను కూడా వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్‌, బిజెపి వంటి పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించడం ఎవరికైనా అర్థమవుతుంది. ఆ కథనాల శీర్షికలే ఏకపక్షంగా వుంటాయి. ఎ.పి లోనైతే పత్రికలు ఛానళ్లు వైసిపి, టిడిపి అనుకూల ప్రతికూల శిబిరాలుగా విభజితమవడం సూటిగానే తెలుస్తుంది. సమస్యను బట్టి గాక ఏ పార్టీకి చెందిన వారనేదానిపై ప్రచారం జరుగుతుంది. వైసిపి కి నేరుగా ఒక పత్రిక, ఛానల్‌ వున్నాయి గనక వాటిలో నిరంతరం టిడిపి పైన, చంద్రబాబు పైన మాత్రమే వ్యతిరేక కథనాలు వస్తాయి తప్ప ప్రభుత్వం గురించి విమర్శ ఇసుమంతైనా వుండదు. ఇక మరో రెండు పత్రికలు, నాలుగు ఛానళ్లు టిడిపి ప్రయోజనాలనే సమర్థిస్తాయి గనక వాటిలో గత పాలన గురించిన ప్రస్తావనలు గాని ఇప్పుడు అనుసరించాల్సిన ప్రజానుకూల విధానాలకు ప్రత్యామ్నాయాలకు గాని ప్రాధాన్యత వుండదు. మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలు, బిజెపి మత రాజకీయాల విషయంలో ఈ రెండు శిబిరాలు దాటవేత వైఖరి ప్రదర్శిస్తుంటాయి. లేదంటే ఆ సమయంలో తమ ఎజెండాను బట్టి ఎగదోయడం లేదా దాటేయడం చేస్తాయి. ప్రజాశక్తి వంటి పత్రికే లేకపోతే ఈ సమయంలో వాస్తవికమైన సమస్యా ప్రధానమైన వార్తలకు అవకాశం వుండేదా అన్నది సందేహమే. తెలంగాణ లోనూ ప్రధానమైన ఛానళ్లు పాలకపక్ష టిఆర్‌ఎస్‌ కు అనుకూలమైనవిగా పేరు పొందితే బిజెపి నేత యాజమాన్యం లోనూ ఒకటి రెండు చానళ్లున్నాయి. వారి స్వంత పత్రిక అచ్చంగా సర్కారు భజనలో మునిగి తేలుతుంటే బిజెపి పట్ల సానుకూలంగా వుండే మరో పెద్ద పత్రిక స్థానికంగా అనుకూల వైఖరినే అనుసరిస్తుంటుంది. వైసిపి కి సంబంధించిన పత్రికా పెద్ద విమర్శనాత్మకంగా వుండదు. కోవిడ్‌ తాకిడిలో బలహీన పడ్డామంటున్న పత్రికలలో సిబ్బంది కోతతో పాటు విలువల తారుమారు, నాణ్యత తగ్గుదల కూడా కనిపిస్తున్నది.

                                               విశ్వసనీయత, సమతుల్యత ఏదీ ?

   సోషల్‌ మీడియా లోనూ మితిమీరిన పొగడ్తలు లేదా శృతి మించిన బూతులు, ఏకపక్ష చిత్రణలు చూస్తాం. వ్యక్తిగతంగానూ స్తోమత గల బడా నేతలు స్వంత వేదికలను స్పాన్సర్‌ చేసుకుంటుంటారు. సాధారణంగా మత ఛాందసం, హిందూత్వ పోకడల వంటి విషయాలలోనూ ఇవి పాక్షికంగానే వ్యవహరిస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు సంబంధించి ప్రాంతీయ ధోరణులకు పెద్ద పీట వేయడానికి కూడా వెనకాడవు. ఇక ప్రజాస్వామిక విలువలు, ఉద్యమాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల, శ్రామిక వర్గ హక్కుల పట్ల ఆసక్తి అసలే నాస్తి.
   ఈ క్రమంలోనే పాలకులు, ప్రభుత్వాలు తమ ఇష్టాయిష్టాలను బట్టి మీడియాపై ఒత్తిళ్లు తేవడం, వరాలు కురిపించడం జరుగుతుంటుంది. ముఖ్యమంత్రులు నేరుగా పేర్లు తీసి మరీ దాడి చేస్తుంటారు. ఏతావాతా జాతీయంగానూ రాష్ట్రాల స్థాయిలోనూ మీడియా విశ్వసనీయత, వాస్తవికత సమతుల్యత కోల్పోతున్న పరిస్థితి. ఎప్పుడు ఏ ఎజెండాను తీసుకు రావాలి, ఎవరిని లక్ష్యంగా దాడి సాగించాలనేది ముందే నిర్ణయమైపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. మీడియా అనేది వ్యవస్థ స్వభావానికి, వర్గ రాజకీయాలకూ అతీతమైందిగా వుండదు గాని మరీ పాక్షికత్వానికి లోనైతే ప్రజలకు సత్యం చేరడం కష్టమవుతుంది.
 

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి