Sep 21,2023 23:52

చేనేత జౌళి శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఐక్య కార్యాచరణ కమిటీ

ప్రజాశక్తి - మంగళగిరి : చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు ఐదేళ్ల నుండి ఎన్నికలు నిర్వహించటం లేదని, నామినేటెడ్‌ బోర్డులు గాని ప్రత్యేకాధికారిగానీ లేకపోవడంతో సంఘాల్లో రోజువారీ కార్యక్రమాలు కుంటుపడి చేనేత కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆవేదన వెలిబుచ్చింది. కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చేనేత జౌళి శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేసి చేనేత జౌళి శాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అన్నారు. గత టిడిపి ప్రభుత్వం ఏడాదిపాటు చేనేత సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించిందని, 2019 ఫిబ్రవరి 11న అప్పటి సిఎం చంద్రబాబునాయుడు టిడిపి నాయకులతో ఆరు నెలలపాటు నామినేటెడ్‌ బోర్డులు ఏర్పాటు చేశారని, అదే ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2019 జులై 7న వైసిపి నాయకులతో ఐదుగురు సభ్యుల నామినేట్‌ బోర్డులు వేసిందని తెలిపారు. అప్పటి నుండి నాలుగేళ్లలో 8 సార్లు నామినేటెడ్‌ బోర్డులను పొడిగించుకుంటూ వచ్చారని, ఈ ఏడాది జులై ఆరో తేదీన ఆ బోర్డుల పదవీకాలం పూర్తి కావడంతో ఏడవ తేదీ నుండి చేనేత సహకార సంఘాలకు అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు ఎవరూ లేరని చెప్పారు. దీనివల్ల బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేసేందుకు వీల్లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాలు కుంటుపడి సహకార సంఘాలు చేనేత కార్మికులకు పని చూపలేని పరిస్థితి నెలకొందన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉండగా కొద్దిపాటి మంది కార్మికులైన పని చూపుతున్న చేనేత సహకార సంఘాలు మూతపడటంతో చేనేత కార్మికుల ఆందోళన చెందుతున్నారని, చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి కార్మికులకు పని చూపించాలని, అప్పటివరకు సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వాలు స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, చేనేత ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.నాగేశ్వరరావు, ఆర్‌.పూర్ణచంద్రరావు, ఎం.సత్యనారాయణ, జి.బాలాజీ, బి.రామారావు, కె.మోహన్‌రావు, టి.సత్యనారాయణ, టి.రామసుబ్బారావు, రామకృష్ణ, కె.వెంకటేశ్వరరావు, బి.మోహన్‌రావు, బి.గిరి, జి.వెంకటకృష్ణ, డి.ఈశ్వరరావు, బి.బాల, డి.సత్యనారాయణ పాల్గొన్నారు.