- ఆ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలి
- రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్మన్ నాగరాణి
ప్రజాశక్తి - రంపచోడవరం
పాలిటెక్నిక్ చేయడం ద్వారా మెరుగైన ఉపాధి లభిస్తుందని, అందువల్ల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన వెంటనే పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యే విధంగా వారికి అవగాహన కల్పించాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంఇఒలు, అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, హెచ్‌ఎంలు, సిఆర్‌టిలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ ప్రతి ఐటీడీఏ పరిధిలో 2014 సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే సాంకేతిక విద్యను అభ్యసించాలన్నారు. ఏజెన్సీలోని ప్రతి పాఠశాలలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు లెక్కలు, ఫిజిక్స్ సబ్జెక్టులపై దృష్టి సారించి విద్యా బోధన చేయాలని సూచించారు. పాలిటెక్నిక్ పాసైన విద్యార్థులకు ప్రైవేట్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని ప్రైవేటు సంస్థల్లో పాలిటెక్నిక్ పాస్ అయిన విద్యార్థులకు అప్రెంటిస్ చేసే సమయంలో నెలకు రూ.12 వేలు నుండి రూ.15వేలు స్టయిఫండ్ కూడా ఇస్తున్నట్లు, కొన్ని కంపెనీలలో రూ.50వేలు నుండి రూ.60వేలు వరకు జీతం పొందుతున్నట్లు తెలిపారు. రంపచోడవరంలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని చదువుకున్న యువతీ, యువకులకు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించే విధంగా మూడుసార్లు జాబ్ మేళాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యేందుకు విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్య డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహె.శ్రీనివాసరావు, పాలిటెక్నిక్ డెవలప్మెంట్ అధికారి మురళి, అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు హాసిని, రామ తులసి, మండల విద్యాశాఖ అధికారులు మల్లేశ్వరరావు, తాతబ్బాయి దొర, పాల్గొన్నారు.










