Jun 27,2023 21:25

ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సానియా

ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ రాజేశ్వరి ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న సానియా అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే...మంగళవారం కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లెకు చెందిన ఆమె ప్రతి రోజూ కళాశాలకు వస్తూ పోతూ ఉంటుంది. మంగళవారం కూడా కళాశాలకు వచ్చింది. మంగళవారం ఉదయం కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి ఆమె దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. విదార్థి కాళ్లు, తలకు బలమైన గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎఎస్‌పి ప్రేరణ కుమార్‌, టూటౌన్‌ సిఐ ఇబ్రహీం చేరుకొని ఘటనకు కారణాలపై ఆరా తీశారు.
విద్యార్థినికి న్యాయం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ
లింగాపురం పరిధిలోని ఎస్‌ఆర్‌ఐటి కళాశాలలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విద్యార్థినికి వైద్య ఖర్చులు పూర్తిగా కాలేజీ యాజమాన్యం భరించాలని, జరిగిన సంఘటనపై సమగ్ర విచారించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ విద్యార్థి, యువజన సంఘం నాయకులు తెలిపారు. మంగళవారం వారు కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సునీల్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌, ఆర్‌ఎస్‌ఓ అద్యక్షులు జగన్‌, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా.నరసింహులు మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఐటి కళాశాలలో జరిగిన సంఘటన విచారకరమన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.