Jun 19,2023 01:13

కె.కాంతారావు

ప్రజాశక్తి - నరసరావుపేట : పాల ఉత్పత్తి పెంపుదలకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి కె.కాంతారావు తెలిపారు. పాడి పశువుల ఆరోగ్యానికి ప్రాధాన్యత, పశు భీమా పథకాలతో పశు పోషకుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ పని చేస్తోందని అన్నారు. పశు పోషకులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తగిన తోడ్పాటును ఇస్తుందన్న ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు.
పాల ఉత్పత్తిని ఏ విధంగా పెంచబోతున్నారు?
వ్యవసాయ రంగానికి ప్రధాన అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ అభివృద్ధికి పశు సంవర్ధక కృషి చేస్తోంది. పశు బీమా, దేశీయ ఆవుల యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమర్థవంతమైన పశు వైద్య సేవలు అందించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐదుగురు రైతులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడితే వారిని ఒక యూనిట్‌ కింద ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మొత్తం యూనిట్‌ విలువ రూ.30 లక్షలు కాగా రైతు వాటా 10 శాతం గ్రూపునకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.9 లక్షలు షెడ్‌ నిర్మాణానికి కాగా గ్రాసం పెంపకానికి నిధులిస్తాం.
లంపిస్కిన్‌ వ్యాధి తీవ్రత ఎలా ఉంది? పశువులేమైనా మృతి చెందాయా?
మరణాలేమీ లేవు. ఈ వ్యాధి పధానంగా ఆవులకు మాత్రమే సోకుతుంది. పల్నాడు జిల్లాలో మొట్టమొదటి లంపిస్కిన్‌ కేసు అమరావతి మండలం అత్తలూరులో గుర్తించాం. పశువు నుండి శాంపిల్‌ సేకరించి పరీక్షలు చేయగా లంపిస్కిన్‌ వ్యాధిగా నిర్ధారణైంది. వెంటనే చికిత్స ప్రారంభించాం. టీకాలు కావాలని ప్రభుత్వానికి నివేదించగా సరైన సమయానికి 80 వేలు టీకాలు వచ్చాయి. వెంటనే వాటిని పశువులకు వేయించాం. మరణాలేమీ సంభవించలేదు.
వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు, మందులు అందుబాటు?
వర్షాకాలంలో పశువులకు గొంతువాపు వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇప్పటికే గొంతు వాపు వ్యాధి టీకాలను పశు వైద్యశాలకు పంపించి టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని పశు వైద్యులకు ఆదేశించాం. 3 నెలలు వయసు నిండిన లేగ దూడల దగ్గర నుండి నాలుగేళ్ల వయసులోపు పశువులకు గొంతు వాపు వ్యాధి నివారణకు టీకాలిస్తాం. పశువులకు సాధారణ వ్యాధుల దగ్గర నుండి అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి.
వైద్యుల కొరత ఉందా?
పల్నాడు జిల్లాలో 64 పశు వైద్యశాలలు ఉండగా 57 ఆస్పత్రుల్లో వైద్యులు సేవలు అందిస్తున్నారు. 7 పశు వైద్య శాలల్లో వైద్యులు లేకపోయినా దగ్గరలో ఉన్న పశు వైద్యుల ద్వారా పశువులకు చికిత్స అందుతున్నాయి.
పశువుల బీమా వర్తింపచేస్తున్నారా?
ప్రభుత్వం నూతనంగా వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం పట్ల పశు పోషకుల నుండి విశేష స్పందన లభిస్తుంది. పల్నాడు జిల్లాలో క్లష్టర్ల వారి కేటాయింపులలో భాగంగా నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నమోదు చేస్తుంది. మేలు జాతి పశువుకు రూ.30 వేలు నుండి రూ.1.20 లక్షల వరకు బీమా వస్తుంది. నాటు పశువుకు రూ.15 వేలు, 6 నెలలు ఆపై వయసు పైబడిన గొర్రెలకు, మేకలకు, పందులకు రూ.6 వేలు వర్తిస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి 100 శాతం బీమా చెల్లించాం. 330 పశువులకు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది.
పచ్చి గడ్డి కొరత ఎలా అధిగమిస్తున్నారు?
పశు గ్రాసాల కొరతను అధిగమించేందుకు పోషక విలువలు కలిగిన టి.ఎం.ఆర్‌ను 60 శాతం ప్రభుత్వ రాయితీ పోను కిలో రూ.6.50కు సరఫరా చేస్తుంది. కావాల్సిన వారు రైతు భరోసా కేంద్రంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా కొనుగోలు చేయవచ్చు. 600 మెట్రిక్‌ టన్నుల టి.ఎం.ఆర్‌ అందుబాటులో ఉంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 టన్నుల వరకు పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించాం.
మేకలు గొర్రెలు సంరక్షణకు తీసుకున్న చర్యలు?
ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు మేకలు గొర్రెలకు నట్టల నివారణకు మందు తాగిస్తాం. దీనిపై ముందురోజే గొర్రెలు మేకల పెంపకం దారులకు తెలియజేస్తాం. నట్టల మందు అందిస్తాం.
జగనన్న పాల వెల్లువ కింద పాల సేకరణ?
అమూల్‌ డైరీ రోజుకు జిల్లాలో 20 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు సేకరణ పెంచడంపై దష్టి సారిస్తున్నాం.