జిల్లా వ్యవసాయాధారిత ఆర్థికాభివృద్ధికి వెన్నెముక కడప, ప్రొద్దుటూరు పాలడెయిరీలు, చెన్నూరు చక్కెర, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీ నీరోడుతోంది. ముఖ్యమంత్రి హోదాలో చేసిన శంకుస్థాపనలు సాకారానికి నోచుకోలేదు. పెండింగ్ పనుల పురోగతికి ఇచ్చిన హామీలు అమలుకు ఆమడదూరంలో ఉన్నాయని చెప్పవచ్చు. కడప నగరంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. కడప నగరంలో నాలుగు స్ట్రోమ్ వాటర్ డ్రెయిన్లు, ఆర్కిటెక్షర్ యూనివర్శిటీ భవన నిర్మాణ ఏర్పాటు, జిజిహెచ్ సూపర్‌స్పెషాలిటీ సేవలు అమలుకుకు నోచుకోలేదు. రూ.454 కోట్ల జిజిహెచ్ బోధనాస్పత్రి, సైక్రియాటిక్, కేన్సర్‌బ్లాక్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పనులు, కొప్పర్తి పైప్‌లైన్ పనులు, హజ్‌హౌస్ పెండింగ్ పనులు అడుగు ముందుకు పడిన దాఖలాల్లేవు. శనివారం నుంచి సోమవారం వరకు జగన్ జిల్లాలోని కడప, పులివెందుల, ఇడుపులపాయ, జమ్మలమడుగు నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలకు హాజరవుతున్న నేపథ్యంలో కథనం.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
కడప, ప్రొద్దుటూరు పాల కర్మాగారాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. పాల కర్మాగారాన్ని పునరు ద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. చెన్నూరు చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు హామీ అటకెక్కింది. మూడు కమిటీలు సర్వే చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. గత పర్యటన సందర్భంగా చక్కెర పరిశ్రమ ఉద్యోగులకు సంబంధించిన రూ.16 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసి, పునరుద్ధరణ పనుల పట్ల ఉదా సీనతగా వ్యవహరించారు. 2007లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ సర్కారు తలపెట్టిన రూ.72 కోట్లతో కడపలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ పెండింగ్‌లో పడింది. రాంకీ కాంట్రాక్టు సంస్థ టెండరును దక్కించుకుంది. 2015 నాటికి 68 శాతం పనులు పూర్తి చేసింది. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి శాఖల అవాంతరాల నేపథ్యంలో చేతు లెత్తేసింది. టిడిపి సర్కారు 2018లో హైద రాబాద్‌కు చెందిన శ్రీసాయి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి 108.41 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కాంట్రాక్టును దక్కించుకున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. రూ.305 కోట్లతో కడపలోని అన్నమయ్య సర్కిల్, గోకుల్ లాడ్జి సర్కిల్ రహదారుల విస్తరణ పనులు టెండర్లు దశను దాటడం లేదు. మాసాపేట సర్కిల్, వైజంక్షన్ సర్కిల్ విస్తరణ పనులు సా.. గుతున్నాయని చెప్పవచ్చు. రూ.70 కోట్ల విలువైన స్ట్రోమ్ డ్రెయిన్‌ల ఏర్పాటు హామీ అటకెక్కింది. ప్రతి ఏటా కురుస్తున్న వర్షాల ధాటికి నగరం ముంపునకు గురవుతోంది. కడపలో స్ట్రోమ్‌డ్రెయిన్ కాల్వల ఆక్రమణలను తొల గించి విస్తరణ పనులు చేపట్టడానికి ఇచ్చిన హామీ నిధులు లేక నీరోడు తోంది. రూ.454 కోట్ల విలువ కలిగిన జిజిహెచ్ బోద óనాస్పత్రి, కేన్సర్, సైక్రి యాటిక్, సూపర్‌స్పెషాలిటీ హౌదా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. రూ.345 కోట్లతో కూడిన ఆర్కిటెక్షర్ యూనివర్శిటీ పనులకు ఆర్కిటెక్ట్ దశను దాటలేదు. ఫలితంగా యూనివర్శిటీ నిర్మాణం ఎప్పటికి సాకా రమవుతుందో తెలియని దుస్థితి దాపురించింది. రూ.12 కోట్లతో కూడిన హజ్‌హౌస్ పెండింగ్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. నిధుల లేమి కారణంగా సకాలంలో పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమ వుతున్నాయి. రూ.150 కోట్ల విలువ కలిగిన కొప్పర్తి పారిశ్రా మికవాడ నీటిపైప్ లైన్ పనులపై అయోమయం నెలకొంది. కొప్పర్తిలో పరిశ్రమల ఏర్పాటుకు నీటి కొరత కారణంగా జంకుతున్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలోని వైఎస్‌ఆర్ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఎప్పటికి కార్యకలాపాలు సాగిస్తాయో తెలియడం లేదు. చెప్పు కోదగిన రీతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన దాఖలా ల్లేవు. కడపలో రెండవ ఆర్టీసీ డిపో, సిటీ బస్సుల సదుపాయాలు అందని ద్రాక్ష చందంగా ఊరిస్తుండడం గమనార్హం. జిల్లావాసే ఆర్టీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి రావడంతో ఆశాభావం వ్యక్తమవుతోంది. 12 కోట్లతో కూడిన బుగ్గవంక ప్రహరీకి ఇరువైపులా రహదారి నిర్మాణ పనులు ఆశించిన రీతిలో సాగలేదు. బ్యూటిఫికేషన్, లైటింగ్ సిస్టమ్ వంటి పనులు ఎప్పుడు ఏర్పడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. జిఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-1లో భాగమైన సర్వ రాయసాగర్, వామికొండ, రిజర్వాయర్లు ఎప్పటికి సాకార మవుతాయో తెలియడం లేదు. ఇటీవల జిల్లా నీటి పారుదలశాఖ రూ.212 కోట్లతో కూడిన ప్రతిపాదనలు పంపిం చినప్పటికి పాల నాపరమైన అనుమతుల మంజూరు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. అన్నమయ్య రిజర్వాయర్ రూ.777 కోట్లతో కూడిన పునరుద్దరణ ప్రక్రియ సా.. .గుతోంది. టెండర్ల దశను దాటు కుని క్షేత్రస్థాయికి చేరుకున్నప్పటికీ ఆశించినరీతిలో పనులు సాగడం లేదు. దీంతోపాటు పింఛా ప్రాజెక్టు పునరుద్దరణ పనులు ఊపందుకోకపోవడం ఆందోళన వ్యక్తమవు తోంది.










