Jul 28,2023 01:26
లోకేష్‌ పాదయాత్రకు రావాలంటూ, తూర్పు కొప్పెరపాడు గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్న తెలుగు మహిళలు

ప్రజాశక్తి-పంగులూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని, పంగులూరు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గొట్టిపాటి వెంకట రత్నకుమారి కోరారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామంలో, తెలుగు మహిళలు పాదయాత్ర ప్రచారాన్ని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ప్రతి మహిళకు బొట్టుపెట్టి పాదయాత్రకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ, పాదయాత్ర ఈ నెల 29వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్నందున, ఆ రోజు పంగులూరు మండలానికి చెందిన తెలుగు మహిళలంతా కార్యక్రమంలో పాల్గొనాలని, యువగళం పాదయాత్ర విజయవంతానికి తోడ్పాటు ఇవ్వాలని ఆమె కోరారు. తెలుగు మహిళలంతా లోకేష్‌ బాబుకు అండగా నిలవాలని, పాదయాత్రలో ప్రధాన భూమిక పోషించాలని ఆమె కోరారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలను వంచించే పరిపాలనను జగన్‌రెడ్డి చేస్తున్నాడని ఆమె విమర్శించారు. జగన్‌ రెడ్డిని ఇంటికి సాగనంపితేనే రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరుగుతుందని ఆమె వివరించారు. మహిళలంతా 29వ తేదీ కొరిశపాడు మండలం తిమ్మనపాలెం వద్దకు రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు కొర్రపాటి నాగమ్మ, రావూరి పార్వతి, జాగర్లమూడి ఆదిలక్ష్మి, ఎనికపాటి అన్నపూర్ణ, రావూరి కళ్యాణి, గొల్లపూడి యోగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.