Jul 07,2023 20:27

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి - కౌతాళం
తుంగభద్ర నది నుంచి వరద కాలువ సాధన కోసం ప్రజలు, కార్యకర్తలు తరలి రావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు, సీనియర్‌ నాయకులు కె.మల్లయ్య కోరారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో మండల కార్యదర్శి ఈరన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలం ప్రతేడాది అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలకు గురవుతోందని తెలిపారు. రైతు ఆత్మహత్యలు, వలసలు పెరిగిపోతున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలు, వలసల నివారణకు మండలంలోని మేళిగనూరు దగ్గర వరద కాలువ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. వరద కాలువను నిర్మిస్తే మండలం సస్యశ్యామలమై వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకొని వరద కాలువ కోసం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వరద కాలువ నిర్మాణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వరద కాలువ సాధన కోసం ఈనెల 26 నుంచి 31 వరకు ఆదోని నుంచి కర్నూలు వరకు పాదయాత్ర చేసి, 31న కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరూ కలిసి రావాలని కోరారు. సిపిఎం మండల కన్వీనర్‌ మేలి గిరి ఈరన్న, వెంకటేశులు, రామలింగ, మారయ్య, హనుమంతు, బసవ, ఖాదర్‌బీ, రామాంజనేయులు, వన్నూరు పాల్గొన్నారు.