Mar 14,2023 21:18

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీశైలం దేవస్థాన ఇఒ లవన్న



పాదయాత్రికులకు అన్ని ఏర్పాట్లు
- శ్రీశైలం దేవస్థానం ఇఒ లవన్న
- ఉగాది మహోత్సవాలపై స్వచ్ఛంద సంస్థలతో సమన్వయ సమావేశం
ప్రజాశక్తి - శ్రీశైలం

        శ్రీశైలం క్షేత్రానికి పాదయాత్రగా వస్తున్న భక్తులకు క్షేత్ర పరిధిలో మార్గమధ్యలో అన్ని ఏర్పాట్లను దేవస్థానం కల్పిస్తుందని ఇఒ లవన్న తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో జరగనున్న ఉగాది మహోత్సవాలపై కర్ణాటక, మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థలు, పాదయాత్ర భక్త బృందాలతో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న మంగళ వారం స్థానికపరిపాలన భవనంలో రెండవ సారి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ పాదయాత్రికులు సేద తీరేందుకు చలువ పందిల్లు, మంచినీరు, అల్పాహారం అందిస్తామన్నారు. వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధించినట్లు చెప్పారు. కావున భక్తులందరూ దేవస్థానం ఏర్పాటు చేసిన సౌచాలయాలను ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. ఉగాది మహోత్సవాలలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించు కుంటామని తెలిపారు. వీరి సేవలను స్వామివారి ఆలయం ముఖ మండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం, ఉచిత క్యూలైన్‌, భక్తులు వేచి ఉండే క్యూ కాంప్లెక్స్‌, పుష్కరిణి, గంగాభవాని, స్నాన ఘట్టాలు, పాతాళ గంగ, హటకేశ్వరం, సాక్షి గణపతి, లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, పబ్లిక్‌ అడ్రెస్సింగ్‌ సిస్టం, తాత్కాలిక సమాచార కేంద్రాలు వంటి పలు చోట్ల వారి సేవలను వినియోగించాలని కోరారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు సేవలను వినియోగించు కునేందుకు పారదర్శకత కోసం లాటరీ పద్ధతిలో సేవలు అందించాల్సిన కేంద్రాలను కేటా యించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.