Oct 01,2023 21:22

ఫొటో : వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

పాదయాత్ర వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నుండి పాదయాత్రలు ప్రారంభం కానున్న సందర్భంగా అందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఆదివారం సిపిఎం ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ ఈ పాదయాత్రను రామాయపట్నం పోర్టు దగ్గర సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పాదయాత్ర 11 రోజులు అనేక మండలాలు పలు గ్రామాలు తిరిగి 13వ తేదీ నెల్లూరుకు చేరుకొని నర్తకి సెంటర్‌ వద్ద జరిగే బహిరంగ సభతో ముగిస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పట్టణాలు గ్రామాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను తీసుకొని రావడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఇచ్చిన విభజన హామీలు, కొత్త పరిశ్రమలను తీసుకొని రావడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణ అమలు చేస్తూ ప్రజలపై భారాలను మోపుతున్నారన్నారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని సాగు, తాగునీరు అందించాలని పట్టణాలలో గ్రామాల్లో ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని పట్టణాలు మరియు పల్లెలను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలను ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజా పోరాటాల ద్వారా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పసుపులేటి తిరుపాలు, భోగిశెట్టి కిష్టయ్య, పి పెంచల నరసింహ, ఎస్‌కె అమీర్‌ భాషా, కే చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.