Jun 03,2023 19:24

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
రాయలసీమ కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో అరుణోదయ విమలక్కతో కలిసి నీటి కోసం పాడుదాం, నిధుల కోసం ఆడుదాం, నియామకాల కోసం పోరాడుదామని రాయలసీమ కోఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్‌ కోరారు. శనివారం రాయలసీమ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యాలయంలో 30న జరిగే రాయలసీమ కళా జాతా, రాయలసీమ కళా రూపాల ప్రదర్శన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర రాజకీయ రంగాలకు ఉద్ధండులైన రాజకీయ వేత్తలను అందించిన రాయలసీమ ప్రాంతం సామాజిక, ఆర్థిక రంగాల్లో పాతాళంలోకి నెట్టివేయబడిందన్నారు. ఇక్కడి ప్రజల జీవన స్థితిగతులను, మౌలిక అవసరాలను, తాగు, సాగునీటిని అందించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం, కరువు, వలసల నివారణ కోసం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. 30న చేపట్టే కార్యక్రమంలో ప్రజా, విద్యార్థి సంఘాలు, రైతులు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. ఆర్‌సిసి రాష్ట్ర నాయకులు రాజకుమార్‌, సుధాకర్‌, రవి వర్మ, శాంతరాజు, శీను, వెంకటేష్‌, రాయలసీమ కళావేదిక జిల్లా అధ్యక్షులు రామ్‌ చరణ్‌, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్‌ పాల్గొన్నారు.