Sep 16,2023 21:13

పచ్చిగడ్డి లేని పంట పొలాలు

చాపాడు : జిల్లాలో వ్యవసాయం తరువాత కీలకమైన రంగం పాడి పరిశ్రమ, సాగు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో 60 శాతం మంది పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతులతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగి స్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని పట్టణాలలోని గహాలకు, హోటళ్లకు అందిస్తూ వందలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు. పాడి పరిశ్రమ ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న వీరికి ప్రభుత్వ సహాయం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు.
తగ్గుముఖం పడుతున్న పాల పొంగు..
రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో పేరుగాంచిన చాపాడు మండలం ప్రస్తుతం పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గాంధీ నగరంలో పశువుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. గతంలో ఈ గ్రామంలో అధిక పాల దిగు బడి సాదించడంతో అనేకమార్లు అవార్డు అందుకొంది. ప్రస్తుతం ప్రభుత్వం పాల సేకరణ కేంద్రాలు లేకుండా పోయాయి. వర్షాలు సరిగా పడకపోవడంతో పచ్చిగడ్డి సరిగా లభించడం లేదు. దాణా ఖర్చులు పెరిగా యని ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. పశవుల దాణా, గడ్డి రేట్లు విపరీతంగా పెరగడంతో పశువుల పోషణ భారం అధికమై, పాడి రైతుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నది. 50 కిలోల పశువుల దాణా రూ.1600, ఎకరా వరిగడ్డి రూ.పది వేల వరకు అవుతుండడంతో పాడి రైతులు చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.
అందుబాటులోకి రాని అమూల్‌ సేవలు..
ప్రభుత్వం ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి పాలను సేకరించేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో పాడి పరిశ్రమకు సంబంధించిన వివరాలను సేకరించే కేంద్రాలను ఏర్పాటు చేసే చర్యలు చేప ట్టారు. అమూల్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని పాల సేకరణ భవనాలు నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నది. 2020లో పాల సేకరణను ప్రారంభించి పులి వెందుల లింగాల చక్రాయపేటలో పాలసీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పులివెందుల, లింగాల, చక్రాయపేట, సింహాద్రిపురం, వేముల, వేంపల్లి, తొండూరు, వీరప్పనాయనపలి,్ల పెండ్లి మర్రి మండలాలలోని 152 గ్రామాల్లో పాల సేక రణ జరుగుతుంది. ప్రతిరోజు 13 వేల లీటర్లు సేకరిస్తున్నారు. మిగిలిన మండలాలలో నిర్వ హణలో ఆలస్యం జరుగుతున్నది. పాడి పోషకులు, ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పటం లేదు. మహిళా సంఘాల ద్వారా పాలసేకరణ చేపట్టేందుకు గతంలో కార్యాచరణ రూపొందించి విషయం తెలిసిందే. ప్రతి ఆర్‌బికె సమీపంలో ఉపాధి హామీ నిధులతో పాల సేకరణ కేంద్రాలను నిర్మించే ఏర్పాట్లు ముమ్మరం చేసి వదిలేశారు. జిల్లాలో 633 ఆర్‌బికెలు అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పాలను సేకరించాలని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రయివేట్‌ పాల కేంద్రాల నుంచి రైతులకు ఎలాంటి లబ్ధి అందడం లేదు. పాడి రైతులకు ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు.
తగ్గిన సేకరణ కేంద్రాలు..
గత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా జిల్లాలో 17 ప్రాంతాల్లో పాల సేకరణ కేంద్రాలు కొద్దిరోజులు నడిపి తర్వాత మూత వేశారు. ప్రయివేట్‌ కేంద్రాల ముందు నిలువలేక పోయాయి. ప్రయివేట్‌ పాల సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకం ఉండడంలేదు. గతంలో పాడి పశువులను కొనుగోలు నిర్వహణకు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వాలు అందించేది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి పరిశ్రమకు ఎలాంటి ఆదరణ కనిపించడం లేదు. పాడి రైతుల కంటే పాల సేకరణ చేసే వారికే లాభాలు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో ఒక రోజుకు లక్ష లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతున్నది. ప్రయివేట్‌ వ్యాపారులు పాలు వెన్న శాతం ప్రకారం ధరలు నిర్వహిస్తున్నారు. వారు మాత్రం మార్కెట్లో లీటర్ల ప్రకారం ధర నిర్ణయించి కల్తీ వ్యాపారంతో కాసులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం 10 వెన్న శాతం 10 వస్తే లీటర్‌ పాల ధర రూ.78 చెల్లిస్తున్నారు. వెన్న శాతం తగ్గితే రూ.50 నుంచి 60లు మాత్రమే రైతులకు అందుతున్నది. 1987లోనే మండల పరిధిలో ప్రభుత్వం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సభ్యుల ఆధ్వర్యంలో దీనితో ప్రతి గ్రామం నుంచి వేల లీటర్లు మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాల కేంద్రాలకు తరలించారు. తర్వాత కాలంలో ప్రయివేట్‌ పాల కేంద్రాల దాటికి ప్రభుత్వ కేంద్రాలు మూత పడ్డాయి .ప్రస్తుత ప్రభుత్వం నూతన పాల సేకరణ విధానం తీసుకు వచ్చి తిరిగి పాత పద్ధతులు తీసుకురావాలన్న ఆలోచనలో ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 6 లక్షల ఆవులు, పశువులు ఉన్నాయి. అధికారికంగా ప్రతి రోజూ ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో పాల ఉత్పత్తులు అత్యధికంగా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఉన్నవి. ప్రయివేట్‌ కేంద్రాల నుంచి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పాలతో పాటు మజ్జిగ ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామాలలో పాలను కొనుగోలు ఎప్పుడు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు .ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలసేకరణ కొనసాగితే పది రూపాయలు సంపాదించుకోవచ్చు అని పాడి రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు.