
పశువుల వ్యాపారంపై నియంత్రణ, మతోన్మాద దాడులు, గో రాజకీయాలు బిజెపి ఎలా నడుపుతున్నదో చూస్తున్నాం. ఒట్టిపోయిన ఆవులు, పని చేయలేని ఎద్దులు దేశ వ్యాపితంగా కోటికి పైగానే వున్నాయి. ప్రభుత్వం అందులో కనీసం పది శాతం పశువులను కూడా గోశాలలో పెట్టి సంరక్షణ చేయలేకున్నది. మిగిలినవి పంట పొలాలను నష్టపరుస్తున్నాయి. సాంప్రదాయక పద్ధతిలో వీటిని అమ్ముకోవడానికి చెప్పలేని నిబంధనలు. ఎంతో కాలం నుంచి మాంసాహారంగా ఉపయోగిస్తున్న ముస్లింలు, దళితులు, గిరిజనులను ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు అడ్డగించడం, చంపివేయడం చేస్తున్నారు. పవిత్రమైన ఆవులను అపవిత్రుల నుంచి కాపాడుతున్న వాళ్లలా ఫోజు పెట్టి, వీడియోలు తీసి జనంలోకి వదులుతున్నారు. మెజారిటీ హిందువుల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నెల 14, 15 తేదీలలో కేరళ లోని కొచ్చి లో ఎఐకెఎస్ ఆధ్వర్యంలో మొదటిసారిగా జరిగిన పాల రైతుల వర్క్‌షాపుకు 14 రాష్ట్రాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ రంగంలో అనుభవం వున్న పలువురు మేధావులు అనేక పత్రాలు ప్రవేశ పెట్టారు. రెండు రోజుల చర్చల అనంతరం పలు డిమాండ్లను రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో వీటిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది.
భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచం లోనే మొదటి స్ధానంలో వుంది. 9 కోట్ల మంది పేదలు, చిన్న రైతులు ఈ రంగంలో జీవనోపాధి పొందుతున్నారు. అందులో 70 శాతం మంది మహిళలే. పాలకు కనీస మద్దతు ధర లేదు. ప్రైవేటు కంపెనీలు ఎంతో ఎక్కువగా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ రంగంలో ప్రవేశించటానికి విదేశీ గుత్త సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి చేస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఒక పక్క గో రాజకీయాలు నడుపుతూ... రెండోవైపు విదేశీ పాడి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నది. కార్పొరేట్- మతోన్మాద శక్తుల కుమ్మక్కు ఇదే.
1970లలో నాటి ప్రభుత్వం పాల ఉత్పత్తిపై ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్న తరువాత అమెరికాను సైతం దాటి...గత ఇరవయ్యేళ్లుగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో వున్నాము. ప్రపంచ ఉత్పత్తిలో 23 శాతం భారత దేశానిది. ఈ 30 సంవత్సరాలలో తలసరి పాల లభ్యత రెట్టింపు అయ్యింది. అభివృద్ధి రేటు 6.51 శాతంగా వుంది. 2018 - 19 లలో పాల ఉత్పత్తి 18.7 కోట్ల టన్నులు. ఇది విడివిడిగా చూస్తే వరి కన్నా, గోధుమ కన్నా కూడా ఎక్కువ. ఈ సంవత్సరం పాల రంగ ఉత్పత్తి విలువ రూ. 12 లక్షల 60 వేల కోట్లను దాటుతున్నది. 2033 నాటికి ఉత్పత్తి 33 కోట్ల టన్నుల స్థాయికి వెళ్ళనున్నది. ఆనాటి అవసరం 29 కోట్ల టన్నులకు మించి వుండకపోవచ్చు. అంటే భారతదేశం పాల ఉత్పత్తిలో నాటికి కూడా మిగులు దేశంగా వుంటుంది. ఇంకా 10 సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి దిగుమతుల అవసరం వుండదు. భారత్‌లో ఒక హెక్టారు లోపు వున్న రైతులు 48.4 శాతం. రెండు హెక్టార్ల లోపు ఉన్నవారు 86.2 శాతం. వీరిలోనే ఎక్కువమంది పాల ఉత్పత్తిలో భాగస్వాములుగా వున్నారు. వీరి బతుకు భద్రతకు పాడి ఎంతగానో తోడ్పడుతున్నది. మాంసం, తోళ్ల ఎగుమతులలో కూడా భారతదేశం ప్రపంచ స్థాయి స్థానాలలో వుంది. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నది. 2021 స్టాటికల్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం చిన్న రైతుల కుటుంబానికి నెలకు వచ్చే వ్యవసాయ ఆదాయం రూ. 3798. అందులో పాడి పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం రూ. 1582. దీనికి తోడు పెంచుకున్న పశువుల అమ్మకం కష్ట కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
రూపురేఖలు మారుతున్న పాల సహకార వ్యవస్థ
దేశంలో వివిధ రాష్ట్రాలలో పాల సహకార వ్యవస్థలు ప్రధాన పాల సేకరణ సంస్థలుగా అభివృద్ధి అవుతూ వచ్చాయి. గుజరాత్‌లో అమూల్, కర్ణాటకలో నందిని, ఉమ్మడి ఆంధ్రలో విజయ, కేరళలో మిల్మా మొదలైనవి. గత 30 సంవత్సరాల ప్రభుత్వాల విధానాలలో వచ్చిన మార్పుల వల్ల ఈ రంగంలో కూడా దేశ వ్యాప్తంగా ప్రైవేటు సంస్థలు ప్రవేశించాయి. నేడు 70 శాతం పాల వ్యాపారం వారి చేతుల్లోనే నడుస్తున్నది. 1999 ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు తల వంచిన తరువాత వెన్న తీసిన పాలను, ఇతర ఉత్పత్తులను ఎలాంటి ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసేందుకు అనుమతి వచ్చింది. దీనివలన ఈ రంగం అనేక ఒడిదుడుకులకు గురికావలసి వచ్చింది. పాలు సాధారణ ప్రజానీకానికి అందుబాటు రేటులో వున్న బలవర్థక ఆహారం. అమూల్, ఇఫ్‌కో (ఐఎఫ్‌ఎఫ్‌సిఓ) లాంటి సహకార సంస్థలు ప్రపంచ స్థాయికి ఎదిగాయి. కరోనా కాలంలో కూడా 16 శాతం లాభాలు ఆర్జించాయి.
సంఘపరివార్ పాల ఉత్పత్తి రంగంపై కన్నువేసింది. గుజరాత్‌ను ఒక రాజకీయ అడ్డాగా మార్చుకున్నది. సహకార భారతి పేరుతో దేశ వ్యాపితంగా 80,000 సొసైటీలు, 470 జిల్లాలు, 27 రాష్ట్రాలలో స్థానం సంపాదించింది. ఇటీవల అమిత్‌షా కేంద్ర సహకార మంత్రి బాధ్యతలు చేపట్టడం కుట్రపూరితమైన ఆలోచన అని అందరికీ అర్థమవుతున్నది.
కేరళలో చక్కగా నడుస్తున్న కుడుంబశ్రీని దెబ్బ తీయడానికి సహకార భారతి 'అక్షయశ్రీ' అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా 1500 సూపర్ మార్కెట్లను కేరళలో ఏర్పాటు చేయటానికి ప్లాన్ చేస్తున్నది. ఈ విధంగా వామపక్ష ఆధీనంలో నడుస్తున్న సహకార వ్యవస్థను దెబ్బ కొట్టాలని చూస్తోంది.
పశువుల వ్యాపారంపై నియంత్రణ, మతోన్మాద దాడులు, గో రాజకీయాలు బిజెపి ఎలా నడుపుతున్నదో చూస్తున్నాం. ఒట్టిపోయిన ఆవులు, పని చేయలేని ఎద్దులు దేశ వ్యాపితంగా కోటికి పైగానే వున్నాయి. ప్రభుత్వం అందులో కనీసం పది శాతం పశువులను కూడా గోశాలలో పెట్టి సంరక్షణ చేయలేకున్నది. మిగిలినవి పంట పొలాలను నష్టపరుస్తున్నాయి. సాంప్రదాయక పద్ధతిలో వీటిని అమ్ముకోవడానికి చెప్పలేని నిబంధనలు. ఎంతో కాలం నుంచి మాంసాహారంగా ఉపయోగిస్తున్న ముస్లింలు, దళితులు, గిరిజనులను ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు అడ్డగించడం, చంపివేయడం చేస్తున్నారు. పవిత్రమైన ఆవులను అపవిత్రుల నుంచి కాపాడుతున్న వాళ్లలా ఫోజు పెట్టి, వీడియోలు తీసి జనంలోకి వదులుతున్నారు. మెజారిటీ హిందువుల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాని ఒట్టిపోయిన ఈ పశువుల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నది. దీనివల్ల వ్యవసాయం దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తున్నది. ఆవులపై అంత ప్రేమ ఒలకబోసేవాళ్లు వాటిని సాకుతూ నియంత్రిస్తున్నారా అంటే అదీ లేదు. ఉత్తరాదిలో ఇదొక ఉపద్రవం కానున్నది.
మత ప్రాతిపదికన విభజన - కార్పొరేట్లకే లాభాలు -అంతర్గత ఎజెండా
ఒక పథకం ప్రకారం గో రక్షణ సాకుతో హింసాత్మక ప్రచారం చేస్తున్నారు. దాని రాజ్యాంగ బద్దతకు అవసరమైన చట్టాలు చేస్తున్నారు. దీని వెనుక వున్న సంఘ పరివార్ లక్ష్యాలను పరిశీలిస్తే వాస్తవం బోధపడుతుంది. 1. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడం, 2. సమాజాన్ని కులాలు, మతాల ప్రాతిపదికన విభజించడం, 3. పాడి పరిశ్రమ నుంచి చిన్న ఉత్పత్తిదారులను బయటకు నెట్టివేయడం, 4. కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతులు, కార్పొరేట్ డెయిరీలకు అవకాశాలు కల్పించడం, 5. మాంసం వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధించడం, 6. అమెరికా, ఐరోపా యూనియన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు పాలు, మాంసం వ్యాపారం లోకి తలుపులు బార్లా తెరవడంగా కనిపిస్తున్నది. మాంసం ఎగుమతిదారులలో అతి పెద్ద వ్యాపారస్తులు బిజెపి ఎన్నికల నిర్వహణ యంత్రాంగం లోను, బిజెపి తోను సంబంధాలు కలిగి వున్నవారు.
ముస్లిం వ్యాపారస్తులు ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారన్న ప్రచారం వాస్తవ విరుద్ధమైనది. అసలు ఈ వ్యాపారంలో పెద్దలందరు బిజెపితో సంబంధం వున్న వారే. సునీల్ కపూర్ ఆరేబియన్ ఎక్స్‌పోర్టర్ సంస్థకు అధిపతి. నవీన్ సబర్వాల్ అనే పెద్ద మనిషి అలోక్ బీర్‌కు అధిపతి. మదర్ అబర్టో ఎంకెఆర్ ఫుడ్ ఎక్స్‌పోర్టుకు యజమాని. ఎ.ఎస్.బింద్రా పిఎంఎల్ ఇండిస్టీకి అధిపతి. అందులో బిజెపి నేత సంగేట్ సాహు, యోగన్ రావత్ ఆల్‌దవా కంపెనీలో భాగస్వాములు.
డిమాండ్లు...
రెండు రోజుల పాటు చర్చించిన అనంతరం రూపొందించిన డిమాండ్లు ఇవి.
1. డెయిరీ రంగానికి ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి
2. భూమి లేని పేద చిన్న రైతు మహిళలు, సామాజికంగా వెనుకబడిన వారికి సహాయంగా సబ్సిడీలు ఇవ్వాలి. ప్రభుత్వాలు రెమ్యునరేషన్ ప్రకటించాలి.
3. ప్రాథమిక ఉత్పత్తిదారులకు ప్రభుత్వ సహకార సంస్థలు, ప్రైవేటు పాల వ్యాపార సంస్థలు పారిశ్రామిక మిగులులో వాటా ఇవ్వాలి.
4. తప్పుడు మిల్కో మీటర్ల ద్వారా పాల వ్యాపారస్తులు చేస్తున్న దోపిడిని అరికట్టాలి. ప్రభుత్వ స్కాడ్స్ ద్వారా దొంగ మిల్కో మీటర్లు వాడుతున్నవారిని పట్టుకొని శిక్షించాలి. ప్రమాణాలు కలిగిన మిల్కో మీటర్లను తయారు చేయాలి.
5. పాల రంగ పితామహుడు డా||వర్గీస్ కురియన్ సంస్మరణ సభలను ఈ నవంబరు 26న దేశవ్యాపితంగా పాల రైతులు నిర్వహించాలి.
/ వ్యాసకర్త : ఎ.పి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు /
వి. కృష్ణయ్య